న్యూఢిల్లీ : జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆతిథ్యమిచ్చే ప్రత్యేక డిన్నర్‌కు హాజరయ్యే అతిధుల జాబితాలో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాల కార్యదర్శులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. మాజీ ప్రధానమంత్రులు డాక్టర్ మన్మోహన్‌సింగ్, హెచ్‌డీ దేవెగౌడను కూడా ఆహ్వానించారు. అయితే రాజకీయ పార్టీలకు చెందిన నేతలను మాత్రం ఆహ్వానించలేదు. కేబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను డిన్నర్‌కు ఆహ్వానించలేదు. ప్రత్యేక డిన్నర్‌కు ఆహ్వానం అందుకొని, విందుకు వారి రాకను ఖరారు చేసిన ముఖ్యమంత్రుల్లో నితీశ్ కుమార్, హేమంత్ సొరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మన్ ఉన్నారు. ఢిల్లిలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల పునరుద్దరణకు నోచుకున్న ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ కాంప్లెక్స్‌లోని భారత్ మండపానికి చెందిన మల్టి ఫంక్షన్ హాల్లో ప్రత్యేక డిన్నర్ ఉంటుంది. అతిథులును అలరించడం కోసం డిన్నర్‌తో పాటుగా స్వల్పకాలిక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మోడీని మహర్షి మనుతో పోల్చిన కాంగ్రెస్
జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆతిథ్యమిస్తున్న ప్రత్యేక డిన్నర్‌కు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించకపోవడంపై తమిళనాడు కాంగ్రెస్ నేత మోహన్ కుమారమంగళం కుల వివక్షను ఎత్తి చూపే వ్యాఖ్య చేశారు. సంస్కృతంలో మనుస్మతి లిఖించిన పురాతన హిందూ మహర్షి మను వారసత్వాన్ని ప్రధాని మోడీ భుజానికి ఎత్తుకున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలను కీలకమైన కార్యక్రమాలకు ఆహ్వానించని ఉదంతాలను ఆయన ఎత్తి చూపారు. అయోధ్యలో రామమందిరం భూమి పూజకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదని, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని కుమారమంగళం గుర్తు చేశారు.
ఖర్గేను ఆహ్వానించకపోవడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ”విపక్ష నేతకు వారు విలువను ఇవ్వరని, జీ-20 సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించరనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది. దేశ జనాభాలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వానికి వారు విలువ ఇవ్వడంలేదు” అని వయనాడ్ ఎంపీ ఆరోపించారు.