- వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాపదినాలు
- అన్ని అధికారిక కార్యక్రమాలు రద్దు
- మాజీ ప్రధానికి రాష్ట్రపతి, ప్రధాని ఇతర నేతల అంజలి
- మన్మోహన్ సింగ్ ఇంటికి సోనియా, రాహుల్, ఖర్గేలు
- హస్తినకు వెళ్లనున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- రేపు ఎఐసిసి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ బౌతిక కాయం
- ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్ లో ఘనంగా నివాళి
న్యూఢిల్లీ – మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని నేటి ఉదయం హాస్పటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు.. దీంతో ఆయన ఇంటికి పలువురు రాజకీయ నేతలు, ఇతరులు వెళ్లి నివాళులర్పిస్తున్నారు. ముందుగా రాష్ట్రపతి ముర్ము నేటి ఉదయాన్నే మన్మోహన్ ఇంటికి వెళ్లి సింగ్ భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఇక ప్రధాని మోదీ సైతం ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. మన్మోహన్ సింగ్ భార్యకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మోదీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా మాజీ ప్రధానికి నివాళులర్పించారు.
రాహుల్, సోనియాలు కూడా…
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రా, రాబర్ట్ వాద్రా ఇవాళ ఉదయం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు…
మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో రేపు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
ఇక మన్మోహన్ మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది కేంద్రం. దీంతో ఈ వారం రోజుల పాటు అన్ని అధికారిక ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అలాగే విద్యా సంస్థలను కూడా సంతాప సూచకంగా మూసివేశారు.
కేంద్ర కేబినెట్ సంతాపం …
ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించింది.. ఆయన దేశానికి సేవలను స్మరించుకుంది.. ఆర్థికపురోభివృద్ధికి ఆయన వేసిన బాటలే భారత్ ను నెంబర్ స్థానానికి నడిపిస్తున్నదంటూ మంత్రి వర్గం పేర్కొంది.. ఆయన లేని లోటు ఎవరూ తీర్చ లేనిదని కేబినేట్ తన సంతాప సందేశంలో పేర్కొంది…
రేపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ బౌతికకాయం…
కాంగ్రెస్ పార్టీ కీలక నేత మన్మోహన్ మరణంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఏడు రోజులపాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైనా జాతీయ జెండాను సగానికి అవనతం చేశారు.. బెలగావిలో జరుగుతున్న సిడబ్ల్యుసి సమావేశంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.. ఇక రేపు ప్రజల సందర్శనార్ధం మన్మోహన్ సింగ్ బౌతికకాయాన్ని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నారు.. ఇక మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు..
చంద్రబాబు,రేవంత్, భట్టి నివాళి .
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు కూడా మన్మోహన్ సింగ్ బౌతికకాయంపై పుష్ప గుచ్చలు ఉంచి నివాళులర్పించారు.