పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని, అగ్నిపథ్ సహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సోమవారంనుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం, మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటు వెనుక కేంద్రం హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలున్నాయి. ఆగస్టు 12వరకు ఈ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి 45 రాజకీయ పక్షాలను ఆహ్వానించామని, 36 పార్టీల తరపున ప్రతినిధులు హాజరై సమావేశాల నిర్వహణపై కొన్ని సూచనలు, కొన్ని అభ్యంతరాలు, మరికొన్ని అంశాలపై చర్చ జరగాలని డిమాండ్లు చేశారని చెప్పారు. అయితే, ప్రభుత్వం ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉందని జోషి వెల్లడించారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టబోతున్నామని, వాటిలో 14 సిద్ధంగా ఉన్నాయని, చర్చలేకుండా ఏ బిల్లునూ ఆమోదించబోమని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేష్, డీఎంకే నేత టీఆర్‌బాలు, తిరుచి శివ, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.
అధికారపక్షంలోనూ అభ్యంతరాలు జైరాం రమేష్..
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం, తమ పార్టీ ఘనతగా చెప్పుకోవడాన్ని ఎన్డీయేకు మద్దతిస్తున్న రాజకీయ పక్షాల్లో కూడా అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. గిరిజన మహిళకు అవకాశం కల్పించామని చెప్పుకుంటున్న బీజేపీ మరోవైపు అటవీ హక్కుల చట్టం-2006ను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకాకపోవడాన్ని జైరాం రమేష్ తప్పుబట్టారు. ఎప్పటిలా ఆయన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు.. ఇది అప్రజాస్వామ్యం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలకు మంత్రి ప్రహ్లాద్ జోషి దీటుగా బదులిచ్చారు. అఖిలపక్ష సమావేశాలకు ప్రధాని హాజరయ్యే సంప్రదాయం 2014కు ముందు కూడా లేదని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలకు హాజరయ్యారో చెప్పాలని నిలదీశారు. కాగా ఢిల్లిd సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్‌లో జరిగే వరల్డ్ సిటీ సమ్మిట్‌కు వెళ్లకుండా ఆటంకాలు కల్పించడం, ఢిల్లిd ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సహా పలువురిపై ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై చర్చకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున లోక్‌సభలో డిప్యూటీ లీడర్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో బీజేపీపక్ష నేత పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి హాజరవగా బీజేడీ నుంచి పినాకి మిశ్రా, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి, టీఆర్‌ఎస్ తరపున కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఆర్‌జేడీ నుంచి ఏడీ సింగ్, శివసేన నుంచి సంజయ్ రౌత్ హాజరైనారు. వివిధ అంశాల్లో ఏకాభిప్రాయ సాధన లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీలంక వ్యవహారాలపై రేపు అఖిలపక్ష భేటీ
శ్రీలంకలో నెలకొన్ని పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని తమిళనాడుకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు కోరిన నేపథ్యంలో మంగళవారంనాడు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం జరిగిన భేటీలో డీఎమ్‌కె, ఏఐఏడీఎమ్‌కె శ్రీలంకలో తమిళులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి సంక్షేమం కోసం భారత జోక్యం అవసరమని సూచించాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన అన్నాడీఎంకే సభ్యుడు ఎం.తంబిదురై, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే తరపున ఆ పార్టీ ఎంపీ టి.ఆర్‌బాలు ఈ డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.