Tuesday, November 26, 2024

వానాకాలం పంట ప్రణాళికలు సిద్ధం.. సకాలంలో వర్షాలు కురిస్తే పెరగనున్న సాగు విస్తీర్ణం..

ఉమ్మడి మెదక్, ప్రభన్యూస్‌ : వానకాలం సీజన్‌కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒకవేళ వర్షాలు విస్తారంగా కురిస్తే మరో 50వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉంది. పెసర, మినుము, కంది, సోయాబీన్‌, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటల కోసం 64,476 క్వింటాళ్ల విత్తనాలు, 1,07,476 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 7,98,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్‌ ముగిసి, వానకాలం సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్న తరుణంలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన ఎరువులు, విత్తనాలు త్వరలో జిల్లాకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లబంగారానికి ధర ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది పత్తి వేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అత్యధి కంగా 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేసే అవకాశం ఉంది.

పత్తివైపే రైతుల మొగ్గు..

పత్తి సాగు లాభసాటి ఉండటంతో రైతులు వానకాలం సీజన్‌లో పత్తి సాగుకు మొగ్గుచూపుతారని వ్యవసా యశాఖ చెబుతున్నది. జిల్లా రైతాంగం 7,45,708 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు ఇప్పటికే అంచానా వేశారు. ఇందులో అత్యధికంగా 3,99,000 ఎకరాల్లో పత్తిసాగు చేయనున్నట్లు అధికారులు చెబుతు న్నారు. గత ఏడాదితో పోలిసే 10.5శాతం మేరకు పత్తిసాగు పెరుగనున్నది. ఆ తర్వాత 78 వేల ఎకరాల్లో వరి, 2,330 ఎకరాల్లో జొన్నలు, 23వేల ఎకరాల్లో మొక్క జొన్న, 27,600 ఎకరాల్లో చెరుకు, 60 ఎకరాల్లో సజ్జ పంటలు సాగు కానున్నాయి. అలాగే 77 ఎకరాల్లో కొర్ర లు, 50 ఎకరాల్లో రాగి, 30 ఎకరాల్లో తీపిమొక్కజొన్న, 43 ఎకరాల్లో ఎర్రజొన్న, 104 ఎకరాల్లో గడ్డి నువ్వులు, 96 ఎకరాల్లో నువ్వులు, 72,800 ఎకరాల్లో సోయాబీన్‌, 50 ఎకరాల్లో పొద్దుతిరుగుడు పంటలను రైతులు సాగు చేయనున్నారు. వీటితోపాటు 11,500 ఎకరాల్లో మినుము, 22వేల ఎకరాల్లో పెసర, 1.08 లక్షల ఎకరాల్లో కంది పంటలను రైతులు సాగు చేస్తారని అంచనా. వీటితోపాటు 968 ఎకరాల్లో రైతులు ఇతర పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు..

వానకాలం సీజన్‌లో రైతులు విత్తనాలు, ఎరువులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నది. సీజన్‌ ప్రారంభం కాగానే రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు నిల్వలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వానకాలం సీజన్‌లో 64,476 క్వింటాళ్ల పెసర, మినుము, కంది, సోయాబీన్‌, మొక్కజొన్న విత్తనాలు అవసరం కానున్నాయి. వీటితో పాటు 7,98,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలను అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా. అలాగే 1,07,476 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఈ మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement