Friday, November 22, 2024

TS | పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి : సత్య వతి రాథోడ్

మక్తల్, (ప్రభన్యూస్) : అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు ఇకముందు జరగదని బిఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కృంగిపోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు .ఇవాళ సాయంత్రం మక్తల్ పట్టణంలోని వట్టం రవి కన్వెన్షన్ హాల్లో స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ పార్లమెంటు సన్నాహక సమావేశానికి మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ,పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలన్నారు.గతంలో కార్యకర్తలను కొంతమేర పట్టించుకోకపోవడం ఎన్నికలకు ముందు కొన్ని పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగిందని ఇకముందు అలాంటి పొరపాటు జరగకుండా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుందని అన్నారు.వంద మీటర్ల లోతు గోతి తీసి బిఆర్ఎస్ పార్టీ ని పాతి పెడతానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాల్లో మాట్లాడడం సమంజసం కాదని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులే బొంద పెట్టడం ఖాయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం చేతకాదని ప్రజలు నుండి తిరుగుబాటు తప్పదని అన్నారు .పార్టీ బలోపేతం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు .ఏ అవసరం ఉన్న పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు దేవర మల్లప్ప ,వెంకటేశ్వర రెడ్డి, రజిని సాయిచంద్ ,నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా ,రాజుల రెడ్డి ,పి.నరసింహ గౌడ్ ,కె.రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement