సీతారామ ప్రాజెక్టుతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను దశలవారిగా నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం జలసందలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాల్లో సాగు నీరు,త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే టీం లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… జులై 2025 లక్ష్యంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి అయితే 3.28 లక్షల కొత్త ఆయాకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు. 550 చెరువులకు సమృద్ధిగా నీరు చేరుతుందన్నారు.
అవసరమైన భూసేకరణకు గాను ప్రత్యేకంగా సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 6,234.91 ఎకరాల భూమికి సేకరించినట్లు ఆయన వివరించారు. ఇంకా సేకరించాల్సింది 993 ఎకరాలు ఉందన్నారు. అందుకోసం సత్వరమే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పై 6,401.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన తెలిపారు. యుద్దప్రాతి పదికన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.