శంషాబాద్, డిసెంబర్ 20 (ప్రభ న్యూస్) : శంషాబాద్ మున్సిపల్ పట్టణంలోని సన్ రైజ్ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న మహిళ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్ గుడా గ్రామానికి చెందిన నిర్మల(30) అనే మహిళ గర్భసంచి సమస్యతో బాధపడుతూ మూడు రోజుల క్రితం సన్ రైజ్ హాస్పిటల్లో చేరింది. అయితే ఆమెకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉండాల్సిందిగా కోరారు. దీంతో ఐసీయూలో ఉన్న ఆమె పరిస్థితి అర్థరాత్రి విషమించింది.
దీంతో డాక్టర్లకు బంధువులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆమె ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు డాక్టర్లను నిలదీయడంతో చేతులెత్తేశారని మృతురాలి భర్త కుమార్ ఆరోపిస్తున్నాడు. ముమ్మాటికీ తన భార్యను డాక్టర్లే పొట్టన పెట్టుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో హాస్పిటల్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాస్పిటల్ కు చెందిన డాక్టర్లు ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడంతో హాస్పిటల్ ముందు మృతురాలి బంధువులు బైఠాయించారు.