Saturday, November 23, 2024

Delhi | ఎగుమతుల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రాధాన్యత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తూ ఎగుమతులకు తోడ్పాటునందిస్తున్న ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా)’లో ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. ప్రపంచంలో ఆరోగ్యకర ఆహార విధానాలపై ఆసక్తి పెరుగుతున్న వేళ రసాయన ఎరువులు వినియోగించకుండా పూర్తిగా సాంప్రదాయ పద్ధతుల్లో సేంద్రీయ పదార్థాలతో పండించిన పంటలకు, వాటి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది.

సేంద్రీయ వ్యవసాయంలో భారతదేశం ప్రపంచంలోనే ముందు వరుసలో నిలుస్తోంది. ఇక్కడ పండించే సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం విదేశాలకు వెళ్లినప్పుడు బహుమానంగా భారత సేంద్రీయ ఉత్పత్తులను తీసుకెళ్లి అందజేస్తున్నారు. భారత్‌ను సందర్శించే వివిధ దేశాధినేతలకు సైతం ఆయన ఇచ్చే బహుమతుల్లో భారత ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంటున్నాయి. ఆరోగ్యకర సేంద్రీయ వ్యవసాయ విధానాలను, ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న ప్రధాని, ఆ మేరకు ‘అపెడా’లో ఆర్గానిక్ డివిజన్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

దేశంలో సేంద్రీయ వ్యవసాయంలో హిమాలయ పర్వత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. గ్లోబల్ ఆర్గానిక్ మార్కెట్లో ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల ఉత్పత్తుల వాటా గణనీయంగా ఉంది. అయితే ఆర్గానిక్ ఉత్పత్తులను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ల్యాబ్ టెస్టులు, సర్టిఫికేషన్ తప్పనిసరి. ఈ ప్రక్రియలో జాప్యం లేకుండా అపెడాలో ఏర్పాటవుతున్న ప్రత్యేక విభాగం తోడ్పాటునందిస్తుంది. సిక్కిం రాష్ట్రం దేశంలోనే పూర్తి సేంద్రీయ వ్యవసాయ రాష్ట్రంగా పేరొందింది. ఈ రాష్ట్రం నుంచి పండించే ప్రతి ఉత్పత్తిని దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలని కేంద్రం భావిస్తోంది.

కేవలం ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాదు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ పథకం ద్వారా సేంద్రీయ వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంపొందించడం, సరికొత్త సేంద్రీయ విధానాలను ప్రవేశపెట్టడంలోనూ తోడ్పాటునందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యురోపియన్ యూనియన్ రెగ్యులేషన్‌తో పాటు అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన ప్రమాణాలను అందుకుంటూ సేంద్రీయ పంటల సాగు చేసేలా రైతులను ప్రోత్సహించనుంది. పంటల సాగు ప్రక్రియను జియో-ట్యాగింగ్ చేసి, వ్యవసాయ క్షేత్రాలను సందర్శించడం సహా ప్రతి ఒక్కటీ డిజిటల్ ఐటీ ఎకోసిస్టంలో నమోదయ్యేలా ఏర్పాట్లు కూడా చేస్తోంది. తద్వారా విదేశాల్లో దిగుమతిదారులు, రిటైల్ వినియోగదారుల్లో భరోసా కల్పించవచ్చని భావిస్తోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement