హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పంచాయతీరాజ్ కమిషనర్‌గా పనిచేసిన ఏ శరత్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదలీ చేసిన ప్రభుత్వం సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వహించిన హన్మతరావును పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌గా బదలీ చేసింది. నల్లగొండ కలెక్టర్‌గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను సిద్దిపేటకు బదలీ చేశారు. ఇప్పటివరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను హన్మంతరావు నిర్వహించారు. నల్లగొండ కలెక్టర్ బదలీ కావడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉన్న రాహూల్‌శర్మను పూర్తి అదనపు బాధ్యతల్లో కలెక్టర్‌గా నియమించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు నల్లగొండ కల్‌క్టర్‌గా ఆయనను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. జోగులంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన యాస్మిన్ భాషనుంచి అదనపు బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉన్న కోయ శ్రీహర్షను పూర్తిస్థాయిలో కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అదేవిధంగా కుమ్రంభీం అసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా చహత్ రాజ్‌పాయ్, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా కర్నటి వరుణ్‌రెడ్డి, ఏటూరు నాగరం ఐటీడీఏ పీవోగా అంకిత్‌ను నియమించింది. ఇదిలా ఉండగా ఇక రాష్ట్రంలోని కీలక స్థానాల్లో పోస్టింగ్‌ల అంశంపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఒక్కో సీనియర్ ఐఏఎస్‌కు నాలుగైదు శాఖల బాధ్యతలు ఉన్నాయని, వారి భారం తగ్గించేందుకు భారీగా బదలీలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్ రఘునందన్‌రావును వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆదివారంనాడు జరిగిన ఐఏఎస్‌ల బదలీలతో మరోసారి ఈ అంశం తెరపైకి వస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న సోమేష్‌కుమార్ పలు ఇంచార్జీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్‌ఏ వంటి కీలక విభాగాల బాధ్యతలు సీఎస్ వద్దే ఉన్నాయి. అదేవిధంగా సందీప్‌కుమార్ సుల్తానియా, అరవింద్‌కుమార్, సునీల్‌శర్మ వంటి సీనియర్లకు భారం తగ్గించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2018 ఎన్నికలకుముందు ఒకేసారి 50మంది ఐఏఎస్‌ల బదలీలు జరిగిన తర్వాత ఇప్పటివరకు పెద్ద ఎత్తున బదలీలు జరగలేదు. అడపాదడపా ఐదారు మందిని బదలీలు చేస్తూ వస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం దృష్య్ఠా జరిగిన బదలీలు మినహా ఒకేసారి మూకుమ్మడిగా ఐఏఎస్‌ల స్థానచలనం జరగలేదు. జివరగా గతేడాది ఆగష్టు 30న 14మందిని గత వారంలో 6గురిని ప్రభుత్వం బదలీలు చేసింది.
ఇప్పటికే కీలక శాఖలకు పోస్టింగ్‌లపై దాదాపు కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం ఇన్‌చార్జీలున్న శాఖలను, రాబడి శాఖలను ప్రత్యేకంగా పరిశీలిస్తోందని సమాచారం. రాష్ట్రంలోని అనేక కీలక శాఖల్లో ఇంచార్జీలే బాస్‌లుగా కొనసాగుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రధాన రాబడి శాఖలు ఇన్‌చార్జీల పాలనలోనే ఉన్నాయనే ఆరోపణలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని అంటున్నారు. ఒక్కో శాఖలో రెగ్యులర్ బాధ్యతలకు తోడు ఇన్‌చార్జీ బాధ్యతలతో అధికారులకు భారం పెరుగుతుండగా, పథకాల అమలు, పర్యవేక్షణ, సత్వర నిర్ణయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. అనేక కీలక నిర్ణయాల్లో వెనువెంటనే పాలనాపరమైన నిర్ణయాలు రాకపోవడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయని ప్రభుత్వం గుర్తించినటల్‌గా ప్రచారం జరగుతున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.