Sunday, November 17, 2024

ప్రణయ్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌.. బిడబ్ల్యూఎఫ్‌ బ్యాడ్మింటన్‌ ర్యాంకిగ్స్‌ విడుదల

భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌ఎప్‌ ప్రణయ్‌ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకును అందుకున్నాడు. మంగళవారం బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ పురుషుల సింగిల్స్‌లో మూడు ర్యాంకులు మెరుగు పర్చుకొని 6వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారి కాంస్య పతకం గెలుచుకొని కొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రణయ్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 9వ ర్యాంకుతో బరిలోకి దిగిన ప్రణయ్‌ అద్భుత పోరాటప్రతిమ కనబర్చాడు.

క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌-1, ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. మంగళవారం బీడబ్ల్యూఎఫ్‌ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్‌ 72437 పాయింట్లతో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు 6ను అందుకున్నాడు. భారత్‌ తరఫున టాప్‌-10లో ప్రణయ్‌ ఒక్కడే నిలిచాడు. మరోవైపు యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఒక్క స్థానం దిగజారి 59581 పాయింట్లతో 11 నుంచి 12వ ర్యాంకుకు పడిపోయాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ థాయ్‌లాండ్‌ స్టార్‌ టోర్నీవిజేత వితిద్‌సర్న్‌ చేతిలో ఓడిపోయాడు. మరోవైపు టోర్నీ తొలి రౌండ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసిన మాజీ నంబర్‌-1 కిదాంబీ శ్రీకాంత్‌ 48753 పాయింట్లతో 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో డెన్మార్క్‌ స్టార్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ తొలి స్థానాన్ని కాపడుకున్నాడు.

- Advertisement -

సింధు ఒక స్థానం ముందుకు..

మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌-1 పీవీ సింధు ఒక్క స్థానం మెరుగుపర్చుకుంది. ఈ ఏడాది పేలవ ప్రదర్శనలు చేస్తున భారత స్టార్‌ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ తేలిపోయింది. తొలి రౌండ్‌లోనే ఓటమితో అందరిని నిరాశ పరిచింది.

డబుల్స్‌ ర్యాంకు పదిలం..

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆశించన స్థాయిలో రాణించక పోయిన భారత స్టార్‌ పురుషుల డబుల్స్‌ జోడీ తమ ర్యాంకును మాత్రం పదిలంగా ఉంచుకోగలిగారు. తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరెడ్డి-చిరాగ్‌ శెట్టిలు 86461 పాయింట్లతో తమ రెండో స్థానాన్ని కాపాడుకున్నారు. పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన వీరి ప్రయాణం క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. మహిళల డబుల్స్‌లో మాత్రం గాయత్రి గోపీచంద్‌- త్రిసా జాలీ ద్వయం రెండు స్థానాలు ఎగబాకింది. తాజా ర్యాంకింగ్స్‌లో గాయత్రి జోడీ 19 నుంచి 17వ ర్యాంకుకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement