మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ‘మా’ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏకంగా ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్యే పోటీ చేరిగే అవకాశం కనిపిస్తోంది. బరిలో సినీ నటి జీవిత రాజశేఖర్, హేమ, నటుడు నరసింహరావులు కూడా ఉన్నారు. ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి సభ్యులందరూ ఒకరిపై ఒకరూ పరోక్ష వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి.. ‘మా’ ఎన్నికల విషయంలో త్వరితగతిన ఓ నిర్ణయానికి రావాలని క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఇటీవల ఓ లేఖ రాశారు. సభ్యుల పరోక్ష విమర్శల కారణంగా అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలిగే ప్రమాదముందన్నారు. దీంతో ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
వీలైనంత త్వరగా ‘మా’ ఎన్నికలు జరిగేలా చూడాలని నటుడు ప్రకాశ్ రాజ్ కోరారు. సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ‘మా’ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజు, మురళీమోహన్ స్పందించారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు.
ఇది కూడా చదవండిః ‘మా’ భవనాన్ని ఎందుకు అమ్మేశారు?: మోహన్ బాబు సంచలన వ్యాఖ్య