న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 79 స్థానాల్లో గెలుపొందుతుందని ఆ పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ (కేఏ పాల్) అన్నారు. బుధవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు ప్రజాశాంతి పార్టీలోకి వలస వస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో చేపట్టిన 8 సర్వేలు తనకు అనుకూలంగా వచ్చాయని అన్నారు.
తమ పార్టీ తరఫున పోటీ చేసేందుకు 119 స్థానాలకు 3,600 దరఖాస్తులు వచ్చాయని, ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంత అధికారులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. జనగామ, సంగారెడ్డి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్రజలు తనను పోటీ చేయమని కోరుతున్నారని తెలిపారు. ప్రజాశాంతి పార్టీకి వస్తున్న ఆదరణ చూసి భయపడి తాను జింఖానా గ్రౌండ్స్‌లో తలపెట్టిన సభకు కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.
కేసీఆర్, కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేస్తున్నారని, కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని పాల్ అన్నారు. పవన్ కళ్యాణ్‌ను కేసీఆర్ కొనేశారని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా బీఆర్ఎస్‌కు వేసినట్టేనని అన్నారు. జయసుధ క్రీస్తు విరోధి పార్టీ బీజేపీలో చేరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారని, ఆమెకు డిపాజిట్లు కూడా రావని అన్నారు.
మరోవైపు తన పుట్టిన రోజు బహుమతిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసుకుందని అన్నారు. ఇందుకు ప్రధాని మోదీ, హోంమత్రి అమిత్ షా తోపాటు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరినట్టుగా కేఏ పాల్ తెలిపారు.