అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న ఇళ్లు జగద్వితమవుతున్నాయి. ఇప్పటికే ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ)కు చెందిన ప్రముఖులు జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని కొనియాడారు. తాజాగా జర్మన్ ప్రభుత్వ బ్యాంకు ఆర్ధికసాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఇటీవల భవనాల్లో ఇంధన సామర్ధ్యం వాతావరణ మార్పులు అనే అంశం మీద గ్లోబల్ వెబినార్ జరిగింది. ఈ వెబినార్లో దాదాపు 45 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, నిపుణులు వారివారి సూచనలు, సలహాలు ఇచ్చారు. అందులో ప్యారిస్ కేంద్రంగా ఉన్న ఐఈఏ (ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ) అనే సంస్థ నుండి మేఖేల్ అనే ప్రతినిధి మాట్లాడుతూ, ఇటీ-వలికాలంలో మూడు మిలియన్ల మేర పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని కొనియాడారు. అంతేకాకుండా ఈ ఇళ్లలో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు అమలు చేయడం మరో అద్భుతమన్నారు. దీనివల్ల కరోనా కష్టకాలంలో 2.5 లక్షల మందికి ఉపాధి దొరకడంతోపాటు వాతావరణ మార్పులకు సంబంధించి ఇది బాగా దోహదకారి అవుతుందన్నారు. ఈ సంఘటన జరిగి నెల రోజులు గడవకముందే ఇప్పుడు జర్మన్ ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న కెఎఫ్‌డబ్ల్యూబ్యాంకు ప్రతినిధులు ఏపీలో జరుగుతున్న జగనన్న ఇళ్ల కార్యక్రమాన్ని పరిశీలించి, అందులో ఇంధన సామర్ధ్య చర్యల అమలుకు రూ. 150 మిలియన్ యూరోల మేర ఆర్ధిక సాయం అందించే అవకాశాలను పరిశీలిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌కు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ మిషన్‌కు సమాచారం అందించారు. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు అదనంగా సహకారం అందించే అవకాశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. వీటన్నింటి పరిశీలనకోసం జులై 11 నుండి 15 మధ్య ఏపీకి వచ్చి రాష్ట్ర గృహ నిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో భౌతిక సమావేశం ఏర్పాటు చేస్తామని సమాచారం అందించారు. దీంతో రాష్ట్రంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలు జగద్వితమయ్యాయి.
జర్మన్ బ్యాంకు ప్రతినిధుల రాక :
నవరత్నాల పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద మొదటి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లను పరిశీలించి, వాటిలో ఇంధన సామర్ధ్య చర్యలను ప్రోత్సహించేందుకు జర్మన్ ప్రభుత్వ బ్యాంకుగా ఉన్న కేడబ్ల్యూఎఫ్ బ్యాంకు ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారని గృహనిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారీగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాల్లో గృహ నిర్మాణ శాఖ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. విద్యుత్ శాఖ సమన్వయంతో ఈ ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయాలనే ఆలోచనతో గృహనిర్మాణ శాఖ ముందుకు వచ్చిందన్నారు. దీని దృష్ట్యా గృహనిర్మాణ కార్యక్రమంలో ఇంధన సామర్థ్యానికి తోడ్పాటు-నందించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశాన్ని అధ్యయనం చేయడానికి, నిధుల కేటాయింపుకోసం ఉన్న పరిస్థితులను అన్వేషించడానికి జర్మనీలోని కేఎఫ్‌బ్ల్యూ బ్యాంక్ ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు.
ఆర్ధిక సాయానికి ఆసక్తి :
రాష్ట్రంలో నిర్మితమవుతున్న జగనన్న కాలనీల్లోని ఇళ్లకు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని అందించాలని ఆసక్తిగా ఉన్నట్లు కేఎఫ్‌బ్ల్యూ బ్యాంక్ టీమ్ లీడర్ డాక్టర్ లక్స్ వివరించారు. పేదలకోసం నిర్మించే ఇళ్లలో ఉత్తమ విధానాలను పాటించడం, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చాయన్నారు. ఇందుకోసం గృహ నిర్మాణ శాఖ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో నిపుణులైన మానవ వనరులను అందించనున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా తమ జర్మన్ బ్యాంక్ నుండి ఇంధన సమర్థవంతమైన గృహాల నిర్మాణం కోసం 150 మిలియన్ల యూరోల వరకు ఆర్ధికసాయం అందించాలని భావిస్తున్నామన్నారు. అలాగే ప్రాజెక్ట్ విజయవంతమైన అంచనా తర్వాత సాంకేతిక సహాయం కోసం మరో 2 మిలియన్ల యూరోలను, విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలకు అదనంగా ఆర్ధికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా ఇళ్లకు విద్యుత్‌ను అందించనున్నామని వెల్లడించారు.
ఇది శుభ పరిణామం :.
జగనన్న కాలనీల ఇంధన సామర్థ్య కార్యకలాపాలలో సహాయాన్ని అందించే అవకాశాలను అధ్యయనం చేయడానికి మరియు అన్వేషించడానికి అత్యంత ప్రసిద్ధ గ్లోబల్ బ్యాంక్ కేడబ్ల్యూఎఫ్ ముందుకు రావటం శుభపరిణామమని అజయ్ జైన్ అన్నారు. గ్లోబల్ ఏజెన్సీల నుండి విదేశీ నిధులు, మద్దతుకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేముందు గృహనిర్మాణ శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రితో తగు సంప్రదింపులు జరిపిన అనంతరం మాత్రమే ఆమోదం తీసుకుంటామని చెప్పారు. జూలైలో జరగబోయే సమావేశంలో ఈ అంశాలపై కేఎప్డnబ్ల్యూ అధికారులతో పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. హౌసింగ్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్ ఇంధన సామర్థంతో పాటు నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన పలు అంశాలను గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌కు అజయ్ జైన్ వివరించారు.
లబ్దిదారుల అవసరాలను తీర్చేలా ముందస్తు చర్యలు :
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈకార్యక్రమం బహుశా దేశంలో బలహీన వర్గాలకు అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమంగా నిలిచిందని మంత్రి జోగి రమేష్ తెలిపారు. లబ్ధిదారుల అవసరాలను తీర్చడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా దీనిని నిలిపేందుకు గృహనిర్మాణ శాఖ శాయశక్తులా పనిచేయాలని సూచించారు.
పైలట్ ప్రాజెక్టుగా కూల్ రూఫ్ :
రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, అడ్మినిస్ట్రేట్రివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) మద్దతుతో పైలట్ ప్రాజెక్టుగా కూల్ రూఫ్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. థర్మల్ సౌకర్యాన్ని కల్పిండం ద్వారా ఇంటి పైకప్పు నుండి వేడి ప్రవేశాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల ఇళ్ల లోపల సాధారణ రూఫ్‌లతో పోలిస్తే ఇండోర్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ తగ్గించవచ్చని వివరించారు. ఈ పైకప్పులు అధిక రిప్లెnక్టివ్ ఆల్బెడో పెయింట్, హీట్ రిప్లెnక్టివ్ టైల్స్ వంటి అనేక రకాల పదార్థాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈకూల్ రూఫ్ అప్లికేషన్ భవనంలో కూలింగ్ ఎనర్జీ లోడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా విద్యుత్‌ను కూడా ఆదా చేయవచ్చన్నారు. ఫలితంగా లబ్ధిదారులకు విద్యుత్ బిల్లులను కొంతవరకు తగ్గించడంలో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
అధ్యయనం తరువాత అన్ని హౌసింగ్ ప్రాజెక్టుల్లోనూ :
ఈ పైలట్ ప్రాజెక్టును అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాతే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అన్ని హౌసింగ్ ప్రాజ్లెక్టలో అదే విధమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలను అనుసరించేందుకు గృహనిర్మాణ శాఖ ఇంజనీర్లు మరియు సిబ్బంది వారికి సహాయం చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలలో సుమారు రూ.37 వేల కోట్లతో తాగునీరు, విద్యుత్, రోడ్లు, ఇంటర్నెట్ వంటి అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని అజయ్ జైన్ తెలిపారు. మొత్తం మంజూరైన 1348 కీలకమైన మౌలిక సదుపాయాల పనుల్లో 1023 పనులు ఇప్పటివరకు గ్రౌండ్ అయ్యాయని తెలిపారు. గృహనిర్మాణ శాఖ పూర్తి చేసిన ఇళ్లకు శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. మీటర్ మరియు సర్వీస్ వైర్‌తో పాటు విద్యుత్ కనెక్షన్‌ను డిస్కాంలు అందించాల్సి ఉందన్నారు. డ్రెయినేజీ పనులు కూడా ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు. ఇంధన బిల్లులను ఆదా చేయడం, ఇంధన సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఇంధన శాఖ ద్వారా గృహాలలో ఇంధన సామర్థ్య చర్యలను ప్రవేశపెట్టాలని గృహనిర్మాణ శాఖ యోచిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న 17 వేల జగన్న్న కాలనీల్లో తాగునీటి కోసం ఇంధన సామ్యర్థపు పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నామని, అదేవిధంగా ఇంధన పొదుపు వీధి దీపాలు ఏర్పాటు- చేయబోతున్నామని అజయ్ జైన్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.