Wednesday, November 20, 2024

World cup | రేపటి నుంచే ప్రాక్టీస్ మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 2 గం.నుంచి ప్రారంభం

హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023 మెగా సమరం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌ కోసం అన్ని దేశాల జట్లు ఒకొక్కటిగా భారత్‌లో అడుగుపెడుతున్నాయి. ఈసారి భారత్‌ వేదికగా ఈ మెగా సమరం జరుగనుండటంతో ఇక్కడి క్రికెట్‌ అభిమానుల సంతోషానికి హద్దులేకుండా పోయింది.

చివరిసారి 2011లో ధోనీ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటినుంచి భారత అభిమానులు మరో ఐసీసీ ట్రోఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరగనుంది. దాంతో టీమిండియా అంచనాలు రెట్టింపయ్యాయి.

ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ సారథ్యంలో టీమిండియా మూడో వన్డే ట్రోఫీని కైవసం చేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ మెగా సమరం ఆరంభానికి ముందు ప్రపంచకప్‌ జట్లు సన్నాహాక మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ప్రతి జట్టు రెండేసి మ్యాచ్‌లను ఆడుతుందని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. కాగా, రేప‌టి నుంచే ఈ వార్మప్‌ మ్యాచ్‌లకు తెరలేవనుంది.

సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు వివిధ స్టేడియాల్లో ఈ సన్నాహాక మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 30న (శనివారం) గువాహటి వేదికగా జరగనుంది. ఇక తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. హైదరాబాద్‌ వేదికగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో రేపు (శుక్రవారం) పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి.

- Advertisement -

వార్మప్‌ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ వివరాలు..

సెప్టెంబర్‌-29 (శుక్రవారం)

పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌, వేదిక: హైదరాబాద్‌
బంగ్లాదేశ్‌-శ్రీలంక, వేదిక: గువాహటి
దక్షిణాఫ్రికా-అఫ్గానిస్తాన్‌, వేదిక: తిరువనంతపురం

సెప్టెంబర్‌-30 (శనివారం)

భారత్‌-ఇంగ్లండ్‌, వేదిక: గువాహటి
ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్‌, వేదిక: తిరువనంతపురం

అక్టోబర్‌-2 (సోమవారం)

ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌, వేదిక: గువాహటి
న్యూజిలాండ్‌-దక్షిణాఫ్రికా, వేదిక: తిరువనంతపురం

అక్టోబర్‌-3 (మంగళవారం)

భారత్‌-నెదర్లాండ్స్‌, వేదిక: తిరువనంతపురం
పాకిస్తాన్‌-ఆస్ట్రేలియ, వేదిక: హైదరాబాద్‌
శ్రీలంక-అఫ్గానిస్తాన్‌, వేదిక: గువాహటి

మ్యాచ్‌ల సమయం: అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2గం. నుంచి ప్రారంభం అవుతాయి. ఇక స్పోర్ట్స్ 18, డిజిటల్‌ మీడియా: డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement