Friday, November 22, 2024

వాయుసేనకు ‘ప్రచండ’ అస్త్రం.. దేశీయంగా తయారైన హెలికాప్టర్లు

సీతాకోక చిలుకలా అందంగా ఎగురుతూ.. తేనెటీగ మాదిరిగా అటాక్​ చేయడం ‘ప్ర‌చండ’ హెలికాప్టర్ల ప్ర‌త్యేక‌త‌.. శత్రువును కన్ఫ్యూజ్​ చేస్తూ దెబ్బతీసేలా దీన్ని తయారు చేశారు. భారత అమ్ముల పొదిలో ఇది మరో గొప్ప అస్త్రంగా చెప్పుకొచ్చు. వీటితో భారత ఆర్మీ క్షిపణి వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. బ్రహ్మోస్‌, అగ్ని, పినాకా శతఘ్నుల సరసన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌ కూడా చేరింది. దేశీయంగా తయారైన తేలికపాటి పోరాట హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’ భారత్‌ రక్షణ రంగ సత్తాను మరింత ఇనుమడింపజేయనుంది. తాజాగా తొలి విడత ‘ప్రచండ్‌’ హెలికాప్టర్లను భారత వాయుసేనకు అప్పగించారు. ‘ప్రచండ్‌’ హెలికాప్టర్‌ క్షిపణులను, ఇతర ఆయుధాలను ప్రయోగించగలదు. ఈ ఆధునిక తరం హెలికాప్టర్లను భారత వాయుసేనలో చేర్చే కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వాయుసేన అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి హాజరయ్యారు. రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ, దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. ఎల్‌సీహెచ్‌ ఇండక్షన్‌కు నవరాత్రుల కంటే మెరుగైన సమయం, యోధుల భూమి రాజస్థాన్‌లో మరొకటి ఉండదన్నారు. ప్రభుత్వ రంగ #హందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిడెట్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ లైట్‌ కంబాట్‌ హెలికాప్టర్‌ (ఎల్సీహెచ్‌)ను అభివృద్ధి చేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పోరాటానికి అనువుగా వీటిని తీర్చిదిద్దారు. ఈ హెలికాప్టర్‌కు ‘ప్రచండ్‌’ అని నామకరణం చేశారు.

రెండు ఇంజిన్లతో 5.8 టన్నుల బరువున్న ఈ తేలికపాటి ఈ హెలికాప్టర్లను ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో మోహరించడానికి రూపొందించారు. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం వీటికి ఉన్నది. నేలను బలంగా తాకినప్పటికీ తట్టుకోగలిగేలా దృఢమైన ల్యాండింగ్‌ గేరును వీటికి అమర్చారు. ఇప్పటికే ఇది అనేక పరీక్షలు పూర్తిచేసుకుంది. శత్రువుపై దాడి చేయడమే కాదు, ప్రమాదం ఎదురైనప్పుడు విచిత్రమైన విన్యాసాలు చేసి తప్పించుకోగలదు. రాత్రిపూట కూడా ఇది పోరాడగలదు. అన్నిరకాల వాతావరణాల్లోనూ ఇది గగనవిహారం చేయగలదు. గాల్లో అద్భుత విన్యాసాలు చేస్తూ శత్రువును గందరగోళానికి గురిచేస్తుంది. 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్‌, టేక్‌ ఆఫ్‌ కాగలదు. సియాచిన్‌-సాల్టోరో ప్రాంతం, తూర్పు లద్దాఖ్‌లో రక్షణాత్మక కార్యకలాపాలు నిర్వహించగలిగేలా వీటిని రూపొందించింది హాల్‌. 20ఎమ్‌ఎమ్‌ టరెట్‌ గన్లు, 70ఎమ్‌ఎమ్‌ రాకెట్‌ వ్యవస్థ, ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులతో ఆయుధాలను ఈ హెలికాప్టర్లు కలిగి ఉంటాయి. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తొలిదశలో లద్దాఖ్‌, జమ్ముకశ్మీర్‌లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో ఈ తేలికపాటి హెలికాప్టర్లను మోహరించనున్నారు. వీటితో.. శత్రు దేశ డ్రోన్లు, సైనిక కార్యకలాపాలు, ట్యాంకుల మో#హరింపు, బంకర్లపై నిఘా పెరుగుతుందని వైమానిక వర్గాలు చెప్పాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement