Friday, November 22, 2024

ప్రభల తీర్థం, ఆంధ్రప్రదేశ్ శకటం.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల శకటాలు సిద్ధమవుతున్నాయి. ఢిల్లీలోని రక్షణశాఖకు చెందిన రంగ్‌శాల మైదానంలో తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. ఆదివారం ఈ శకటాలను రక్షణశాఖ మీడియాకు ప్రదర్శించింది. ఈ ఏడాది 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్టు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 6 కేంద్ర ప్రభుత్వ విభాగాలు ఉంటాయని చెప్పారు. రక్షణశాఖకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు స్పెషల్ ఫోర్సెస్, పారామిలటరీ బలగాలు, ఇతర సాయుధ బలగాలు ప్రతియేటా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. అయితే ఈ ఏడాది తొలిసారిగా దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)’ అవకాశం దక్కించుకుంది. 17 రాష్ట్రాల్లో దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. తెలంగాణ మాత్రం ఈ ఏడాది దరఖాస్తు చేయలేదని తెలిసింది.

- Advertisement -

కోనసీమలో జరిగే ‘ప్రభల తీర్థం’ థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సిద్ధం చేస్తోంది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ శకటం ఉంది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించి వేడుక జరుపుకోవడమే ప్రభల తీర్థంగా ప్రాచుర్యం పొందింది. “ప్రభల తీర్థం – మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ” అనే థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపిన ప్రతిపాదనను, నమూనా శకటాన్ని రక్షణశాఖ ఆమోదించింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయమే ప్రజల ప్రధాన వృత్తి. అనాదిగా వ్యవసాయం చేస్తూ వస్తున్న ప్రజలు, దాంతో ముడిపడ్డ సంస్కృతి సాంప్రదాయాలను అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కోనసీమ ప్రాంతంలో మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజున శివుడి ప్రతిరూపాలుగా ఏకాదశ రుద్రులను ఒక చోటకు చేర్చి వేడుక జరుపుకుంటారు.

శివపార్వతులకు ప్రతిరూపాలైన ప్రభలు, గరగలను రంగురంగుల బట్టలు, రంగు కాగితాలు, నెమలి ఈకలు, వరి గుత్తులతో అలంకరిస్తారు. కొబ్బరి ఆకులు, చెరకు, అరటి చెట్లను ఊరేగింపుగా తీసుకువెళ్లడం సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ ప్రాంతానికి అందాన్ని చేకూరుస్తుంది. వెదురు తోరణాలతో శివుని విగ్రహాలను అలంకరించి కోనసీమ ప్రాంతంలోని అన్ని గ్రామాల నుంచి భారీ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ప్రజలు ప్రభల తీర్థం వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చడం, సంప్రదాయ సంగీత వాయిద్యాలు, గరగ జానపద కళారూపాలు ప్రదర్శిస్తూ వేడుక చేసుకుంటారు. సమాజంలో శాంతి, లోకకళ్యాణం కోసం ఏకాదశ రుద్రులు ఉత్సవ ప్రదేశంలో అంటే జగ్గన్నతోటలో సమావేశమవుతారని స్థానిక ప్రజల నమ్మకం. రైతులను సంఘటితం చేసేందుకు, వారి ఐక్యతను పెంపొందించేందుకు కోనసీమలో ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడాన్ని పిఠాపురం రాజులు ఆదరించారు. పాతకాలం నాటి ఆచారాన్ని అదే జోరుతో ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారు. ఇదంతా ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం శకటాన్ని రూపొందించింది.

మరోవైపు ప్రపంచంలో అనేక దేశాలను పట్టిపీడిస్తూ భారతదేశానికి కూడా సవాళ్లు విసురుతున్న మాదకద్రవ్యాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ‘నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో’ (ఎన్సీబీ)కి ఈ సారి వేడుకల్లో అవకాశం కల్పించారు. మాదకద్రవ్యాలను గుర్తించడంతో శిక్షణ పొందిన శునకాలతో పాటు ఆ విభాగం సిబ్బంది ఈసారి వేడుకల్లో భాగం కానున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement