Friday, November 22, 2024

తెలంగాణలో అధికారమే లక్ష్యం.. ఎంపీ లక్ష్మణ్‌కు జేపీ నడ్డా దిశానిర్దేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని విస్తరించి అధికారంలోకి తీసుకురావాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… నడ్డా తనను అభినందించారని చెప్పారు. బీజేపీ తరఫున తెలంగాణ నుంచి తనను రాజ్యసభకు పంపడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపారంటే ప్రధాన కారణం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడమేనని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడం వల్ల ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంచుకున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన నియంత పాలనపై పోరాడాలని నడ్డా సూచించారని ఆయన వివరించారు.

బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని, వారిపై పెడుతున్న అక్రమ కేసులను ప్రతిఘటించాలని మార్గనిర్దేశం చేసినట్టు లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై రాజ్యసభలో చర్చించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా, జనంలో విశ్వాసం కలిగించేలా పని చేయాలని జేపీ నడ్డా సూచించారని లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పుత్రోత్సాహంతో కేసీఆర్ అధికారం కోసం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement