Monday, November 18, 2024

ప్రధాని సొంత రాష్ట్రంలోనే పవర్‌హాలిడేలు.. తెలంగాణలో విద్యుత్ కొరతే లేదు: ఎంపీ లింగయ్య యాదవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే విద్యుత్ కొరత ఉందని, అక్కడ పవర్‌హాలీడే అమలవుతోందని టీఆర్ఎస్ ఎంపీ (రాజ్యసభ) బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉందని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎన్డీయే ప్రభుత్వ 8 ఏళ్ల పాలనపై ఆయన మీడియా సమావేశ నిర్వహించారు. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేకుండా పోయిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా 80 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్నప్పటికీ, కేవలం 40 వేల టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని, కేంద్రం ఎలాంటి బహుళార్థసాధక ప్రాజెక్టులు నిర్మించలేదని అన్నారు.

నదీజలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలిపారు. వ్యవసాయానికి బడ్జెట్లో సరైన స్థాయిలో కేటాయింపులు జరపడం లేదని వ్యాఖ్యానించారు. దేశానికి అన్నం పెట్టే రైతుపైన బీజేపీ కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోందని లింగయ్య యాదవ్ దుయ్యబట్టారు. రైతుల మోటర్లకు మీటర్లు బిగించే కుట్రలకు పాల్పడుతోందని నిందించారు. తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కొనలేని అసమర్ధ ప్రభుత్వమని లింగయ్య యాదవ్ విమర్శించారు.

ఏదైనా మాట్లాడితే మతం, హిందూ-ముస్లిం అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దశాబ్దాలుగా వెనుకబడిన దళితుల కోసం దళిత బందు పథకం అమలు చేస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement