హైెదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో విద్యుత్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నాం 12 గంటల వరకు 14794 మెగావాట్ల వినియోగం కావడంతో.. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్‌గా నమోదైంది. రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్ డిమాండ్ 6666 మెగావాట్లు మాత్రమే ఉంటే.. ఇప్పుడు 15 వేల మెగావాట్ల పైగా విద్యుత్ వినియోగానికి దగ్గల్లో ఉన్నది. రాష్ట్ర విభజన తర్వాత గృహ విద్యుత్ కనెక్షన్లతో పాటు వ్యవసాయ కనెక్షన్లు కూడా భారీగానే పెరగడంతో విద్యుత్ వినియోగం ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12996 మెగావాట్లు వినియోగమైనట్లు నమోదైంది. ఈ విద్యుత్ డిమాండ్ భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం మధ్యాహ్నాం వరకు 14501 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది.
అంటే ఒక్క రోజు వ్యవధిలోనే 273 మెగావాట్ల వినియోగం పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో 14160 మెగావాట్ల అత్యధిక విద్యుత్ వాడకం జరిగింది. అయితే ఈ సారి మాత్రం డిసెంబర్‌లోనే మార్చి డిమాండ్‌ను అధిగమించి 14160 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అంటే గత మూడు నెలల నుంచే విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అంటే ఈ వేసవికి సంబంధించి మరో రెండున్నర నెలల్లో దాదాపుగా 16000 మెగావాట్ల నుంచి 1700 మెగావాట్ల డిమాండ్‌కు చేరుకునే అవకాశం ఉందని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఎంత విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి 37 శాతంతో.. తెలంగాణది మొదటి స్థానం..
మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రెండో స్థానాని ఆక్రమించుకున్నది. అదే వ్యవసాయ రంగానికి సంబంధించిన విద్యుత్ వినియోగానికి వచ్చే సరికి తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. మొత్తం విద్యుత్ వినియోగంలో ఒక ఒక వ్యవసాయ రంగానికే 37 శాతం విద్యుత్ వాడకం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయం స్పష్టమవుతోంది. రైతానికి 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు, సాప్ట్‌వేర్ ఆఫీసులు, పట్టణీకరణ వేగం పెరగడం వల్ల పెద్ద ఎత్తున గృహానిర్మాణాలు పెరగడంతో.. అంతే స్థాయిలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాస్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 26 లక్షల 22 వేల 465 వరకు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాటి సంఖ్య 18 లక్షల 44 వేల 116 మాత్రమే ఉన్నాయి. ఈ ఎనిమిదేళ్ల కాలంలో వ్యవసాయ కనెక్షన్ల సంఖ్య 42 శాతం వరకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి 7 నుంచి 9 గంటల వరకే విద్యుత్ సరఫరా ఉండేదని, ఇప్పుడు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన కరెంట్ అందిస్తున్న విషయాన్ని సంబంధిత అధికారులు గుర్తు చేస్తున్నారు.