హైదరాబాద్ నగరంలోని సింగరేణి కాలనీ ఘటన నిందితుడు రాజు మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్టేషన్ ఘన్పూర్ సమీపంలో గుర్తించారు. దీంతో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు డీజీపీ చెప్పారని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే, రెండ్రోజులుగా నిందితుడు రాజును ఎన్ కౌంటర్ అయినా చేస్తారు లేదా ఆత్మహత్యగా చూపిస్తారన్న అంచనాలు వినిపించాయి. ఇదే అంశాన్ని పీఓడబ్ల్యూ నేత సంధ్య ప్రస్తావించారు. తాము పోలీసులతో మాట్లాడితే టాస్క్ ఫోర్స్ అదుపులో ఉన్నారని మొదట చెప్పారని, ఎన్ కౌంటర్ లేదా ఆత్మహత్యగా చూపిస్తారని తమకు తెలుసని ఆమె కామెంట్ చేశారు.
ఇది ముమ్మాటికీ పోలీసుల హత్యగా సంధ్య స్పష్టం చేశారు. నిందితుడు తమకు దొరకలేదని చెప్పటం పోలీసుల నాటకమే అన్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయటమో, ఆత్మహత్యగా చూపటమో కాదని, సమస్య మూలాల నుండి పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవస్థలతో శిక్ష వేయాలని, హత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే కానీ ఇది సరైంది కాదని సంధ్య అభిప్రాయపడ్డారు.