ట్రెయినీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌కు అరెస్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆమెను తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం కనిపించడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అన్నారు. ఆమెను ఆగస్టు 21 వరకు అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
తదుపరి విచారణ ఆగస్టు 21వ తేదీ వరకు వాయిదా వేస్తూ.. అప్పటి వరకు అమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆమెను తక్షణం అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందో స్పష్టం చేయాలంటూ ఢిల్లీ పోలీసులకు, యూపీఎస్సీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక యూపీఎస్సీ పరీక్షల్లో తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం సంపాదించిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రాథమిక ఆధారాలతో ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు ఆమె భవిష్యత్తులోనూ మరే పరీక్షలు రాయకుండా డీబార్ చేసింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేసుకోవడానికి తగిన ఫోరమ్‌ను ఆశ్రయించే స్వేచ్ఛను ఆమెకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది.