Wednesday, October 2, 2024

TG | ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్‌ మహా- 24 : మంత్రి శ్రీధర్‌ బాబు

మంథని, (ప్రభన్యూస్‌) : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్‌ మహా- 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్‌ బాబు అన్నారు. బుధవారం మంథనిలోనే శివ కిరణ్‌ గార్డెన్స్‌లో శివ కిరణ్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన పోషన్‌ మహా 2024 ముగింపు కార్యక్రమంలో మంత్రి డి.శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు.

పోషన్‌ మహా కార్యక్రమంలో భాగంగా శివ కిరణ్లో గార్డెన్‌ లో ఏర్పాటు చేసిన అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం తదితర కార్యక్రమాలలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ… పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్య వంతమైన పిల్లలు తయారవుతారన్నారు.

పిల్లలకు మంచి పోషకాలు అందించాలని లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషణ్‌ మహా-24 కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. జిల్లాలోని అర్బన్‌ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ మహిళలకు సేవలు అందిస్తున్న అంగన్వాడి టీచర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల అమలులో అంగన్వాడి టీచర్లు సహాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో దేశమంతా లాక్‌డౌన్‌ నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో కరోనా మహామ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారని తెలిపారు.

రాబోయే రోజులలో అంగన్వాడీ టీచర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఐసిడిఎస్‌లో జిల్లాలో ఎక్కడైనా అంగన్వాడీ టీచర్లు సహయకుల పోస్టులు ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అంగన్వాడి భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు.

- Advertisement -

అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నాణ్యతలో ఎక్కడా లోపం జరగవద్దని, అందరికీ పౌష్టికాహారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సిడిపిఓలను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లకు, సహాయకుల ఆరోగ్య పరిస్థితులు చెక్‌ చేసేందుకు మెడికల్‌ క్యాంపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్‌ ను కోరారు.

పౌష్టికాహారం ప్రాముఖ్యత పై సదస్సుల నిర్వహణ, ఎటువంటి ఆహారంలో ఏ పోషకాలు ఉంటాయి, పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాల పై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంగన్‌ వాడి కేంద్రాలను పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని, కర దీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆట పాటలతో బోధన అందించాలని అన్నారు.

ప్రతి రోజు అంగన్‌ వాడి కేంద్రాలలో నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం బోధన జరగాలన్నారు. ప్రతి బుధవారం పోషక లోపం ఉన్న పిల్లల తల్లి తండ్రులతో పిల్లల అందించాల్సిన పోషకాహారం, పాటించాల్సిన శుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు.

గ్రామాలలో అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్‌ పిల్లల జాబితా ఉంటే సేకరించి సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్‌ గా మానిటరింగ్‌ చేయాలని, ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలని, పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని కలెక్టర్‌ అంగన్‌ వాడి టీచర్లకు సూచించారు.

గర్భిణీ స్త్రీలకు అనేమియా ఉంటే అవసరమైన పోషకాహారం, మందులు అందజేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. విలోచవరం అంగన్వాడీ సెంటర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వచ్చతా హీ సేవ పోస్టర్‌ను విడుదలచేసారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్‌ అధికారి వి.హనుమా నాయక్‌, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్‌ ఖాన్‌, సిడిపిఓలు, అంగన్‌ వాడి టీచర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement