ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఐపీఓ ప్రణాళికల్ని పక్కన పెట్టినట్లు సమాచారం. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1250 కోట్లు సమీకరించాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు శుక్రవారం కంపెనీ ప్రకటించింది. ఈక్విటీ మార్కెట్‌లో పరిస్థితులు బలహీనంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దాదాపు మూడు కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా స్నాప్‌డీల్ ఐపీఓకి రావాలని తొలుత భావించింది. ఇందుకు సంబంధించి గతేడాది డిసెంబర్‌లోనే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా కూడా ఇచ్చింది. తాజాగా వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సెబీకి లేఖ రాసింది. కొత్తతరం సాంకేతిక కంపెనీల షేర్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న క్రమంలో స్నాప్‌డీల్ ఐపీవో సాహసం చేయదలచుకోలేదట.
భవిష్యత్‌లో ఎపుడైనా మళ్లి పబ్లిక్ ఇష్యూ ప్రతిపాదన పునస్సమీక్షి స్తామని వెల్లడించినప్పటికీ, అది ఎప్పుడనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకప్పుడు దేశంలో ఇ-కామర్స్ రంగంలో దూసుకెళ్లిన స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో గట్టిపోటీ ఎదురవడంతో మార్కెట్‌పై పట్టుకోల్పోయింది. ఐదేళ్ల కిందట ఫ్లిప్‌కార్ట్‌లో విలీనం అయ్యేందుకు కూడా సంప్రదింపులు జరిపింది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరేందుకు పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలపైనా స్నాప్‌డీల్ దృష్టిసారించింది.