Tuesday, November 26, 2024

Delhi | కొమ్మూరి నియామకంపై పొన్నాల అసంతృప్తి.. హై క‌మాండ్‌కు ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప రెడ్డి నియామకంపై మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పొన్నాల వ్యతిరేకిస్తున్న కారణంగానే ఇన్నాళ్లుగా పెండింగులో పెట్టిన జనగామ డీసీసీ చీఫ్ నియామకాన్ని బుధవారం రాత్రి ఏఐసీసీ పూర్తిచేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆయన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. గురువారం ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన లేఖ కాపీని మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో అందజేశారు. అదే సమయంలో పార్లమెంట్ నుంచి బయటకు వెళ్తున్న రాహుల్ గాంధీని కలిసి సమస్యను వివరించారు.

ఆయనకు కూడా లేఖ కాపీని అందజేశారు. రాజ్యసభ వాయిదా పడ్డ తర్వాత తన నివాసానికి చేరుకున్న మల్లికార్జున ఖర్గే, సాయంత్రం గం. 7.00 సమయంలో పొన్నాల లక్ష్మయ్యను పిలిపించి మాట్లాడారు. ఈ సందర్భంగా జనగామ డీసీసీ నియామకం విషయంలో తన అసంతృప్తిని ఖర్గే వద్ద వెల్లడించినట్టు తెలిసింది. ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ పరిస్థితులు, జనగామ డీసీసీ నియామకం గురించి మాట్లాడినట్టు చెప్పారు. పార్టీని బలోపేతం చేయాలంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించానన్నారు. ఖర్గేను కలవడం అంటే ఫిర్యాదు చేయడం కోసమే అనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఖర్గేతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా తాను ఆయనతో పార్టీ అంతర్గత విషయాలు చర్చించానని చెప్పారు.

అయితే ఖర్గేకు అందజేసిన లేఖలో పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత, ప్రాతినిథ్యం లేకుండా పోయిందని, ముఖ్యంగా బీసీ నేతలకు అవమానాలే ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మొత్తం రాష్ట్రంలోని 35 డీసీసీలు, పట్టణ కాంగ్రెస్ కమిటీల్లో 22 మంది అధ్యక్షులు అగ్రవర్ణాలకు చెందినవారేనని, జనాభాలో సగం కంటే ఎక్కువున్న బీసీలకు ఇచ్చింది కేవలం 6 మాత్రమేనని ఆయన వెల్లడించారు. పార్టీ పదవుల్లో బీసీలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని రాహుల్ గాంధీ చేసిన సూచనలు ఆచరణలో అమలుకావడం లేదని అన్నారు. ముఖ్యంగా జనగామ డీసీసీ నియామకం విషయంలో ఏఐసీసీ మార్గదర్శకాలను సైతం తుంగలో తొక్కారని ఆయన అన్నారు. మార్గదర్శకాల ప్రకారం డీసీసీ అధ్యక్ష పదవిని ఆ జిల్లాకు చెందిన నేతకే ఇవ్వాలని, కానీ స్థానికేతరుడు, పలు పార్టీలు మారి వచ్చిన కొమ్మూరి ప్రతాప రెడ్డికి ఎలా ఇస్తారని ఆయన అన్నారు.

అమెరికాలో నాసా వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఉద్యోగం చేస్తుండగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించానని లేఖలో పొన్నాల గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం చేసిన సేవలు, పొందిన పదవులు, బాధ్యతల గురించి వివరించారు. గత తొమ్మిదేళ్లుగా పార్టీ లో జరుగుతున్న వ్యవహారాలు తనను తీవ్రంగా కలసివేస్తున్నాయని, పార్టీని, రాహుల్ గాంధీని, పార్టీలోని సీనియర్ నేతలను నిందించినవారికి, పార్టీకి ఓటు వేయవద్దని చెప్పినవారికి, పార్టీ అక్రమాలకు అవినీతికి పాల్పడుతుందని ఆరోపణలు చేసినవారికి ప్రాధాన్యతనిస్తూ క్రమశిక్షణతో పనిచేస్తున్న తనలాంటివారిని పార్టీ నిర్లక్ష్యం చేయడం చూస్తుంటే గుండె రగిలిపోతోందని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement