అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించబడే పాలిసెట్ 2023 దరఖాస్తుల ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్‌పర్సన్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివరాలతో కూడిన కరపత్రం ఆవిష్కరణ, ఆన్ లైన్ లో నమూనా దరఖాస్తు నింపటం ద్వారా నూతన విద్యా సంవత్సర పాలిటెక్నిక్ ఆడ్మిషన్ల ప్రక్రియకు నాంది పలికారు. పాలీసెట్-2023 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 30కాగా, పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 10వతేదీన నిర్వహించనున్నామని ఈ సందర్భంగా నాగరాణి పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత ప్రమాణాలు, సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలని కమిషనర్ నొక్కిచెప్పారు. పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తామని, పరీక్ష వ్యవధి 2 గంటలు కాగా, ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుందని చదలవాడ వివరించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ తదితర విభాగాలలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందగలుగుతారన్నారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఆసక్తిగల విద్యార్ధులకు ఉచిత పాలీసెట్ కోచింగ్ అందించబడుతుందని కమిషనర్ తెలిపారు.
శుక్రవారం నుండి దీనికి సంబంధించిన మరింత సమాచారం, నవీకరణల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https:/polycetap.nic.in ని సందర్శించవచ్చని నాగరాణి వివరించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌లలోని సహాయ కేంద్రాన్ని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.