న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గోదావరి నదీ జలాల్లో కాలుష్యం లేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం మంత్రి జవాబిచ్చారు. దేశంలోని కలుషిత నదీ భాగాలను గుర్తిస్తూ 2018 సెప్టెంబర్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపిసీబి) విడుదల చేసిన నివేదిక ప్రకారం రాయనపేట నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదీ జలాలు కలుషితం అయినట్లు గుర్తించినప్పటికీ, నవంబర్ 2022 సీపీసీబీ నివేదికలో ఆ జాబితా నుంచి గోదావరిని తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజమండ్రి వద్ద గోదావరి జలాల్లో కాలుష్య నిర్మూలన, నదీ జలాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ (ఎన్ఆర్సీపీ) పథకం కింద 110.22 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.
గోదావరి నదీ జలాల్లో కాలుష్య నిర్మూలన కోసం రాజమండ్రి సమీపంలోని హుకుంపేట వద్ద రోజుకు 30 మిలియన్ లీటర్లు శుద్ధి చేసే సామర్ధ్యంతో సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణంతో పాటు ఇతర చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే 2022 మార్చిలో గోదావరి నదీజలాల సంరక్షణ, కాలుష్య నిర్మూలన కోసం ఎన్ఆర్సీపీ పథకం కింద హుకుంపేట వద్ద అదనంగా రోజుకు 50 మిలియన్ లీటర్ల సామర్ధ్యంగల మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి రూ. 88.43 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 2025 మార్చి నాటికి దీని నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ఆయన అన్నారు.
నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం (ఎన్‌డబ్ల్యూసీఎం) కింద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు/ పొల్యూషన్ కంట్రోల్ కమిటీలతో కలిసి మానిటరింగ్ స్టేషన్స్ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న నదులు, నీటి వనరులలో నాణ్యతను నిరంతరాయంగా పర్యవేక్షిస్తుందని మంత్రి జవాబులో చెప్పారు. పర్యవేక్షణ ఫలితాల ఆధారంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమయానుసారంగా నీటి నాణ్యతను మూల్య నిర్ధారణ చేస్తుందని అన్నారు. నమామి గంగే మాదిరిగా నమామి గోదావరి ప్రాజెక్ట్ ప్రారంభించే యోచన ప్రస్తుతానికి లేదని బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు.