వాయు కాలుష్యమే కారణం
శ్వాసతీసుకోవడమే కష్టంగా ఉంటోంది
ఢిల్లీలో వాయు కాలుష్యం మరీ దారుణం
డాక్టర్లు బయటికి వెళ్లొద్దని సూచించారు
అందుకో ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నా
ఆందోళన వ్యక్తం చేసిన సీజేఐ చంద్రచూడ్
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెట్టడానికి తోడు.. పొగ మంచు రాజధాని ప్రాంతాన్ని కమ్మేయడంతో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం.. ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
డాక్టర్లు ఇదే చెప్పారు..
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ తెలిపారు. ‘‘నేటి నుంచి నేను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేశా. సాధారణంగా నేను ఉదయం 4 నుంచి 4.15 మధ్య వాకింగ్‌కు వెళ్తాను. ప్రస్తుతం బయటి వాతావరణంలో గాలి నాణ్యత బాగా పడిపోయింది. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లకపోవడమే మంచిదని నా పర్సనల్ డాక్టర్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంట్లోనే ఉండటం ద్వారా శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.. అందుకని ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నా’’ అని సీజేఐ తెలిపారు.
శ్వాసతీసుకోవడమే కష్టంగా ఉంటోంది..
శుక్రవారం ఉదయం 8 గంటలకి ఢిల్లీలో గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ) 283వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఆనంద్ విహార్‌లో 218, పంజాబీ బాగ్‌లో 245, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 276, జిల్మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో 288గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. రెండు రోజులుగా రాజధానిలో కాలుష్యం పెరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వాపోతున్నారు.
నవంబర్ 10న సీజేఐ పదవీ విరమణ..
కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన 2022 నవంబర్ 8వ తేదీ నుంచి ఈ పదవిలో ఉన్నారు. చంద్రచూడ్ తర్వాత భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 11వ తేదీన సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేస్తారు. సంజీవ్ ఖన్నా ఈ పదవిలో ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.