హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులతో కలిసి ప్రతీ క్షణం మానిటరింగ్ చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పోలింగ్ ప్రశాంగంగా జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీ పరిస్థితి కూడా అదుపులోనే ఉందని తెలిపారు.
బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసులు నమోదు అయ్యాయని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రాష్ట్ర పోలీసులను డీజీపీ అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వ్యూహాత్మకంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చర్యలు తీసుకున్నామన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలోని పోలింగ్ కేంద్రాలతో పాటు మరికొన్ని సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ఉన్నతాధికారులతో కలిసి ప్రతీ క్షణం మానిటరింగ్ చేశామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నామని, పోలింగ్ పూర్తయిన తర్వాత కేంద్ర బలగాలతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్‌కి తరలించామన్నారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో గడువు ప్రకారం సాయంత్రం 5 గంటల కల్లా పోలింగ్ పూర్తయిందని వివరించారు.
చత్తీస్‌గఢ్‌లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్‌ల ప్రభావం ఏమీ లేదని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు స్వేచ్చగా ఓటేశారని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్, సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో ఎలాంటి గొడవల్లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు.
చిన్న చిన్న కేసులు…
జగిత్యాల జిల్లాలో ఓటు వేస్తూ ఫొటో తీసుకున్న ఓటరుపై అధికారులు కేసు నమోదు చేశారని డీజీపీ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం వేముల కుర్తిలో ఓటు వేస్తూ జయరాజ్ అనే ఓటరు సెల్ఫీ దిగాడని, ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఓ ఓటర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వీడియో తీసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుందన్నారు.
నెల్లికుదుర్ మండలం హేవ్లుతాండ పోలింగ్ కేంద్రం నంబర్ 160లో ఓటు వేసే దృశ్యాలను మొబైల్‌లో తీసిన బాలకృష్ణ అనే ఓటర్‌పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా బాలకృష్ణ తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో ఫోన్‌తో పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. బాలకృష్ణ ఓటు వేసే దృశ్యాలను వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఘటనపై విచారణ చేపట్టాలని స్థానిక పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.