Tuesday, November 26, 2024

Polling Day – తొలి ద‌శ ముద్ర‌కు స‌ర్వం సిద్ధం – 102 లోక్‌స‌భ స్థానాల‌కు రేపే పోలింగ్

రేపే 21 రాష్ట్రాల్లో ఎన్నిక‌లు
త‌మిళ‌నాడులో అన్నిస్థానాల‌కు స‌న్న‌ద్ధం
తొలి ద‌శ బ‌రిలో నిలిచిన హేమా హేమీలు
ఓట్ల వేట‌లో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఒక మాజీ గవర్నర్

- Advertisement -

దేశం వ్యాప్తంగా లోక్​సభ ఎన్నికల కోలాహాలంగా నెలకొంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దేశంలోని 543 లోక్​స‌భ నియోజకవర్గాలకు ఏడు దశలలో ఎన్నికలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి విడత ఎన్నికల పోలింగ్ రేపు (19 ఏప్రిల్‌) జ‌ర‌గ‌నుంది. తొలి ద‌శ‌లో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక.. ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో, రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 5 చొప్ప‌న‌ స్థానాలు.. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో 3 స్థానాల చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్‌లో 2 లోక్ సభ స్థానలతో పాటు ఛత్తీగ‌ఢ్‌, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో లోక్ సభ స్థానాల‌కు రేపు ఉద‌యం నుంచి సాయంత్రం అయిదు గంట‌ల‌వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంది. పోలింగ్ నేప‌థ్యంలో కేంద్రాల వ‌ద్ద భారీగా భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.. పోలింగ్ బూత్ లలో వెబ్ కెమెరాల‌ను ఏర్పాట్లు చేసి పోలింగ్ స‌ర‌ళిని ఎప్ప‌టిక‌ప్ప‌డు అధికారులు ప‌రిశీలించ‌నున్నారు. ఇప్ప‌టికే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, ఇత‌ర సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాల‌కు చేరుకున్నారు.

తొలి ద‌శ‌లోనే 8 మంది కేంద్ర మంత్రులు

ఈ మొదటి విడతలో జ‌రిగే ఎన్నికల్లో ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు పోటీపడుతున్నారు. రేపు పోలింగ్‌ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నా పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు.

నితిన్‌ గడ్కరీ

మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్దమ‌య్యారు బీజేపీ నేత నితిన్‌ గడ్కరీ. ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్‌ ముట్టెంవార్‌పై 2014లో 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్‌ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో ఓడించి ఎదురులేదని నిరూపించారు. ఈ సారి కాంగ్రెస్‌ నేత వికాస్‌ థాకరే (57)ను ఢీకొంటున్నారు.

కిరెన్‌ రిజిజు:

2004 నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో నిలిచారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్‌ మాజీ సీఎం మాత్రమే కాదు.. ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సర్బానంద సోనోవాల్‌:

నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ‌కు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్‌ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్‌ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలికి బీజేపీ ఈసారి టికెట్‌ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది.

సంజీవ్‌ భలియా:

ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్‌ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్‌ పార్టీ అభ్యర్థి దారాసింగ్‌ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది.

జితేంద్ర సింగ్‌:

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్‌ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు.

భూపేంద్ర యాదవ్‌:

రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బాలక్‌ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్‌ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లలిత్‌ యాదవ్‌ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు.

అర్జున్‌రాం మేఘ్వాల్‌:

రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌తో మాజీ కాంగ్రెస్‌ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ తలపడుతున్నారు.

ఎల్‌.మురుగన్‌:

తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్‌.మురుగన్‌ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్‌ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు.

తమిళిసై సౌందరరాజన్‌:

తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ చెన్నై సౌత్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు.

బిప్లవ్‌కుమార్‌ దేవ్‌:

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్‌ త్రిపురలో బిప్లవ్‌ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆశిశ్‌ కుమార్‌ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement