Friday, November 22, 2024

Delhi | ఆడపిల్ల మీద నీచ రాజకీయం.. లై-డిటెక్టర్ టెస్ట్​కైనా రెడీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళ బోడపాటి శేజల్ తనను ఎమ్మెల్యే, అతని అనుచరులు లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ లేఖ కూడా రాసిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం వరకు ఐసీయూలో ఉంచి చికిత్సను అందజేసిన ఆర్ఎంఎల్ వైద్యులు, అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఆమెకు ఆక్సిజన్ సపోర్ట్ అందజేశారు.

మరోవైపు ఆత్మహత్యాయత్నం ఘటనపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. శనివారం శేజల్‌తో పాటు ఢిల్లీ వచ్చిన ఆది నారాయణ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శేజల్ మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఆమె వాంగ్మూలం నమోదు చేయలేకపోయారు. ఆమె వాంగ్మూలం ఆధారంగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. శేజల్ శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్య రాజకీయాల కోసం తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఎమ్మేల్యే మీద తక్షణమే తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అప్పుడే ఎమ్మేల్యే చిన్నయ్య చేసిన మోసాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు  బయటకు వస్తాయని తెలిపారు. ఆత్మహత్య చేసుకునేంతలా తనను ఎమ్మేల్యే, ఆయన అనుచరులు తీవ్ర వేధింపులకు గురిచేశారని ప్రకటనలో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే నిజంగా ఏ తప్పూ చేయకపోతే మీడియాలో లైవ్ డిబేట్లో పాల్గొనాలని, తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. 5 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. తాను, తన వ్యాపార భాగస్వామి ఆది నారాయణ లై-డిటెక్టర్ పరీక్షలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఆడపిల్ల మీద నీచ రాజకీయాలు చేస్తున్నారని, ఎమ్మేల్యేకి కూడా ఆడపిల్లలు ఉన్నారని, వారిని కూడా ఎవరైనా ఇలాగే వేధిస్తే చూస్తూ ఊరుకుంటారా అని శేజల్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే చిన్నయ్యను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని, అప్పటి వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement