Friday, November 22, 2024

Politics: కాంగ్రెస్ రహిత కూటమికోసం.. మమత ప్రయత్నాలు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్

ముంబై: కాంగ్రెస్ రహిత విపక్ష కూటమి కోసం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమమతా బెనర్జీ ప్రయత్నాలు ముమ్మరం చేశారని, అయితే మహారాష్ర్ట రాజకీయాల్లో మాత్రం ఆమె జోక్యం చేసుకోబోరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. శివసేన అధికార పత్రిక సామ్నాలో వారంవారం ఆయన రాసే రోఖ్ తఖ్ శీర్షికలో భాగంగా ఆదివారం రాసిన వ్యాసంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ముంబై వచ్చిన మమతా బెనర్జీ దేశంలో యూపీఏ ఎక్కడుందంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రౌత్ ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీలోంచి వలసలను ప్రోత్సహిస్తున్న మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీపై ఎదురుదాడి ముమ్మరం చేసింది.

కేంద్రప్రభుత్వంపై పోరాటంలో కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా విఫలమైందని తృణమూల్ అధికార పత్రిక జాగో బంగ్లాలో విమర్శలు గుప్పించింది. వచ్చే ఎన్నికల్లో నరేంద్రమోడీకి వ్యతిరేకంగా విపక్ష ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ ఉంటారని, రాహుల్ గాంధీ కాదని రెండురోజులక్రితం ఇదే జాగో బంగ్లా పత్రికలో తృణమూల్ స్పష్టం చేసినవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రౌత్ వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవల ముంబై వచ్చిన మమత మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, రాష్ర్ట మంత్రి ఆదిత్య థాకరేతో భేటీ అయిన అనంతరం ఆమె మాట్లాడుతూ శివసేన, ఎన్సీపీ ఇక్కడ బలంగా ఉన్నాయని, అందువల్ల తన పార్టీ ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement