న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘రజాకార్’ సినిమాను విడుదల చేయకుండా నిలిపివేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎంపీ బినోయ్ విశ్వం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు సెన్సార్ బోర్డుకు సినిమాపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ.. ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. రెండు చోట్ల ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాకు ఫైనాన్స్ చేశారని తెలిపారు. రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణలో సాయుధ పోరాటం జరిగిందని, కానీ బీజేపీ దాన్ని విముక్తి పోరాటంగా చూస్తుందని నారాయణ అన్నారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల బీజేపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. రజాకార్ సినిమాను విడుదల కాకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సినిమా విడుదలైతే మత విద్వేషాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ఓటర్లను వర్గీకరించడానికి, పోలరైజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రజాకార్ సినిమా టీజర్‌లో ప్రస్తావించిన అంశాలు, దృశ్యాలు స్పష్టంగా సినిమా వెనుక ఉన్న రహస్య ఉద్దేశాలను సూచిస్తున్నాయని అన్నారు.
స్వాతంత్ర్య సమరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజాం తిరోగమన శక్తులకు, రజాకార్ల క్రూరమైన పారామిలిటరీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిందని గుర్తుచేసింది. రావి నారాయణరెడ్డి, సి.రాజేశ్వరరావు, మఖ్దూం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌర్, పి.సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకులు నిజాం అణచివేత, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా రైతులను, శ్రామికులను సమీకరించి, భూమిని, స్వాతంత్య్రాన్ని గెలిపించేందుకు అత్యున్నత త్యాగాలు చేశారని సీపీఐ నేతలు వ్యాఖ్యానించారు.
రజాకార్ సినిమాలో ఒక పాట రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను ఎలా మలుపు తిప్పుతున్నాయో చూపిస్తుందని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను పోలరైజ్ చేయడానికి అసత్యాలను వ్యాప్తి చేయడానికి, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి సినిమాను ఉపయోగించడం చాలా అభ్యంతరకరం అన్నారు. సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసే ముందు సినిమాలోని చారిత్రాత్మక దోషాలను నిశితంగా పరిశీలించాలని సెన్సార్ బోర్డును కోరినట్టు చెప్పారు.