Saturday, November 23, 2024

Elections | ఎన్నికలకు రెఢీ అంటున్న రాజకీయ పార్టీలు..

లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా అటు జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార ఎన్‌డీఏ ఇప్పటికే కూటమిని బలోపేతం చేసుకుంటోంది. మూడోసారి విజయం తమదేనంటూ బీజేపీ ధీమాతో ముందుకెళ్తోంది. మరోవైపు, కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఈ కూటమి ప్రస్తుతం సీట్ల పంపకం ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

అయితే, సీట్ల సర్దుబాటుపై పలు రాష్ట్రాల్లో ఈ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్‌కు రెండు సీట్లే ఇస్తామని టీఎంసీ ప్రతిపాదించగా అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగుతామని హస్తం పార్టీ హెచ్చరించింది. జనవరి 14 నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ నుంచి ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ పేరుతో పాదయాత్ర చేయబోతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ పరంగా ఇప్పటికే తమతో కలిసొచ్చే పార్టీలతో సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశంపై చర్చలు మొదలెట్టారు. పొత్తులకు సంబంధించి ముకుల్‌ వాస్నిక్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరుసగా రాష్ట్రాల పర్యటనలు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు.

ఒకరకంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారని చెప్పవచ్చు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో దేశవ్యాప్తంగా ‘వికసిత భారత్‌’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని పురష్కరించుకుని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌తో కలిసి పక్షం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement