Saturday, November 23, 2024

మండుతున్న ఎండలు-కాక పుట్టిస్తున్న నేతల పాదయాత్రలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అసలే భగభగమంటున్న సూర్యుడు.. మండుతున్న ఎండలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అలాంటి ఈ వేసవిలో రాజకీయ వేడిని మరింత పెంచేందుకు పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. తెలంగాణలో మండే ఎండల్లో నాయకుల పాదయాత్ర పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. ఎండ వేడితో ఉక్కపోత ఒకవైపు, రాజకీయ నేతల పాదయాత్రలతో రాజకీయ కాక మరోవైపు ఉదృతంగా ఉండటంతో గ్రామీణ ప్రజానీకం కూడా కుతకుతలాడుతున్నారు.

ఒకే సమయంలో నాలుగు పార్టీలకు చెందిన నేతలు యాత్రలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. తెలంగాణలో పాగా వేయాలన్న సంకల్పంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పాదయాత్ర ప్రారంభించింది. ఇప్పటికే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల, బహుజన్‌ సమాజ్‌ పార్టీ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రజలను కలుస్తూ సాగుతున్నారు.

రెండో విడత యాత్రలు..

తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ ప్రజలతో కలిసి మరింత బలోపేతమవడంపై దృష్టి సారించింది. అందుకే గతేడాది ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర మొదలెట్టారు. 36 రోజుల పాటు తొలి దశ పాదయాత్ర సాగింది. ఆ తర్వాత ఈ నెల 14న ఆయన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. 31 రోజుల పాటు ఈ రెండో విడత పాదయాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే టార్గెట్‌గా ఆయన అడుగులు సాగుతున్నాయి. ఇక తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిల ప్రజా ప్రస్థాన యాత్రను తిరిగి కొనసాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, కరోనా కారణంగా మధ్యలో షర్మిల పాదయాత్రకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

రాజ్యాధికారం కోసం..

- Advertisement -

బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా తన ఐపీఎస్‌ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం బ#హుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర సమన్వయకర్తగా కొనసాగుతున్న ఆయన బ#హుజన రాజ్యాధికార యాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగేస్తున్నారు. ప్రజా సమస్యలపై ఇటు టీఆర్‌ఎస్‌ను అటు బీజేపీని విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంపై ఈ రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపడుతున్నారు. ఇక పంజాబ్‌ ఎన్నికల్లో విజయంతో జోరు మీదున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ పట్టు సాధించడం కోసం మహా పాదయాత్రకు అంబేద్కర్‌ జయంతి రోజు శ్రీకారం చుట్టింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement