రాజమండ్రి : త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభం బుధవారం కాపు సామాజికవర్గ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తుని రైల్వే కేసు కొట్టివేసినందున సత్యం జయించిందని ముద్రగడ పద్మనాభం ఇవాళ లేఖను విడుదల చేశారు. తన జాతి రిజర్వేషన్ జోకర్ కార్డులా మారినందుకు బాధపడుతున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీల్లో చేరాలని ప్రధాన రాజకీయ పార్టీలు కోరాయి. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇవాళ లేఖలో మాత్రం తన రాజకీయ భవిష్యత్తును త్వరలోనే ప్రకటించనున్నట్టుగా ముద్రగడ పద్మనాభం ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత కల్గించింది. జనసేన, బీజేపీ నేతలు గతంలో ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపారు.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2016లో తునిలో రైలు దగ్దమైంది. ఈ కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయం ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు అవకాశం లేకపోలేదు.