హైదరాబాద్, ఆంధ్రప్రభ: గత వారం రోజులుగా హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న జరిమానాలు వివాదస్పదమవుతున్నాయి. జూబ్లిహిల్స్ ప్రాంతంలో ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న వాహనం ప్రమాదం జరిగిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు నగర కమీషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా హెల్మెట్, లేదా వెహికిల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ చూసే పోలీసులు తాజాగా పలు వాహనాలపై అనధికార స్టిక్కర్స్ అంటూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో వాహనాలపై పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, ప్రెస్, ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీ, డాక్టర్, అడ్వకేట్ ఇలా ఏ పేర్లతో స్టిక్కర్లు ఉన్న సదరు వాహనాలపై రూ.700 జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు వాహనాలకు బ్లాక్ ఫిలిం ఉంటే వాటిని అక్కడే తొలగించి ఫైన్ వేస్తున్నారు.
ఇదిలా ఉంటే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తున్నామని చెబుతున్న పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అలాంటి చట్టాలు రవాణాశాఖలో లేవని రవాణా శాఖ మాజీ అధికారులతో పాటు ప్రస్తుత అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోలీసు చట్టం ప్రకారం ఏదైనా ఉన్నాయో వారే చెప్పాలని అంటున్నారు. కేవలం నంబర్ ప్లేట్‌పై మాత్రమే ఎలాంటి స్కిక్కర్లు అంటించవద్దనే నిబంధనతో పాటు బ్లాక్ ఫిలింకు సంబంధించి నిబంధనలు ఉన్నాయంటున్నారు. ఇలా చేసినప్పుడే జరిమానాలు విధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. తనిఖీలలో భాగంగా పోలీసులు కొంతమంది జర్నలిస్టులకు సైతం జరిమానాలు విధించడంతో ఆ సంఘం నేతలు ట్రాఫిక్ అధికారులను కలిసి చర్చించారు. దీంతో నాలుగు రోజుల పాటు వారిపై జరిమానాలు విధించమని ఆ తర్వాత సంబంధిత కంపెనీల నుండి ఐడెంటీ కార్డులు తెచ్చుకోవాలని సూచించారు. అయితే జర్నలిస్టులతో పాటు పలువురు పోలీసుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేని నిబంధనల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శిస్తున్నారు. మాట్లాడితే నిబంధనలు, చట్టాలు, సెక్షన్‌లు అంటున్న పోలీసులు వాహనాలపై స్టిక్కర్లను అతికించరాదని, ఒక వేళ అతికిస్తే జరిమానాలుంటాయన్న నిబంధన ఏ చట్టంలో ఎక్కడ ఉందో ఎందుకు బహిర్గతం లేదని ప్రశ్నిస్తున్నారు. నకిలీలున్నారనుకుంటే వారిని కట్టడి చేసేందుకు వేర్వేరు మార్గాలున్నాయని, అలాకాకుండా అందరినీ ఒకే తరహాలో చూసి జరిమానాలు విధించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..