Saturday, November 23, 2024

డీజీపీ కార్యాలయం ముందు పోలీసు ఉద్యోగార్థుల ధర్నా.. భారీగా ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోలీసు నియామక ప్రక్రియలో వయో పరిమితిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం డీజీపీ కార్యాలయం ముందు నిరుద్యోగురు ధర్నా నిర్వహించారు. దీంతో ప్రధాన రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి కొంత సేపు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఆందోళనకు దిగిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీసు స్టేడియంకు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 రాగా, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 587 ఉన్నాయి. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ 2 వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి గడువు 20 వ తేదీ. ఎస్సై పోస్టుల వయోపరిమితి ఈ ఏడాది జూలై 1 వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, అదే సమయంలో 25 సంవత్సరాలు దాటరాదు.

ఈ వయోపరిమితిలో మూడేళ్ళ సడలింపును ఇచ్చారు. కానిస్టేబుల్‌ వయో పరిమితి విషయానికి వస్తే ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్ళు నిండి ఉండాలి, 22 సంవత్సరాలు దాటరాదు. మహిళా కానిస్టేబుల్‌ (సివిల్‌, ఏఆర్‌), మహిళా వార్డర్లకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. వితంతువులు, భర్త నుంచి విడాకులు పొంది తిరిగి పెళ్ళి చేసుకోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 18 ఏళ్ళు నిండి గరిష్టంగా 40 సంవత్సరాలకు మించకూడదు. ఇతర అన్ని కులాల్లో 18 – 35 మధ్య వయసు గలవారు అర్హులని పేర్కొన్నారు. అయితే ఈ వయో పరిమితిని పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

గడచిన కొన్నేళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌లను జారీ చేయకపోవడంతో చాలా మంది వయసు పెరిగిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం రెండేళ్ళ వయో పరిమితిని పెంచాలని కోరుతున్నారు. అంతేకాకుండా అగ్నిమాపక శాఖ, జైళ్ళ శాఖలోని కానిస్టేబుల్‌ పోస్టులకు గతంలోవయో పరిమితి 35 సంవత్సరాలు ఉండగా, ప్రస్తుతం దాన్ని 30 ఏళ్ళకు కుదించారంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయో పరిమితిని అకస్మాత్తుగా కుదించడంతో తాను నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే బాధితులకు పోలీసు అధికారులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement