మహబూబ్ నగర్ క్రైమ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొని కంటి సమస్యలు పరిష్కరించుకోవాలని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్ అన్నారు. సోమవారం ఆయన జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లాలో వెయ్యి మంది పోలీసు అధికారులు, 300 మంది హోంగార్డులు ఉన్నారని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతిఒక్కరూ కంటి పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కావలసిన వారు కంటి అద్దాలు కూడా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైద్యులు చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించి తన చేతుల మీదుగా కొంతమంది అధికారులకు ఉచిత కళ్ళద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అడిషనల్ ఎస్పీ రాములు, డి.ఎస్.పి మహేష్, ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.