Thursday, November 21, 2024

AP | చంద్ర‌బాబు పర్యటనకు పోలీసుల ఆంక్షలు.. విశాల‌మైన ప్ర‌దేశాల్లో స‌భ పెట్టుకోవాల‌ని లేఖ‌

కుప్పం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 4, 5, 6 తేదీలలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన పర్యటనకు ఆంక్షల బ్రేక్ పడనుంది.. గత ఏడాది నుంచి ప్రతి మూడు నెలల కొకసారి కుప్పం నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటించే ఆనవాయితీలో భాగంగా చంద్రబాబు ఈ నెల 4వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి కుప్పంకు రానున్నారు. ఇటీవలికాలంలో రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు పర్యటనలలో చోటు చేసుకున్న అవాంఛ‌నీయ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సెక్షన్ 30 నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చాయని స్థానిక పోలీసు శాఖ అధికారులు ప్రకటించారు.

ఈ కారణంగా బహిరంగ కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.. ఈ మేరకు చంద్రబాబు పీఏ మనోహర్ కు మంగళవారం పోలీసు అధికారులు లేఖ రాశారు. ఆ లేఖలో ఇరుకు సందుల్లో, జాతీయ, రాష్ట్రీయ రహదారులలో ర్యాలీలు. సభలు, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు. కావాలంటే సభల నిర్వహణకు విశాలమైన మైదాన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అనుమతి కోరితే పరిశీలిస్తామని ఆ లేఖలో పలమనేరు డీ ఎస్ పీ స్పష్టం చేశారు. అయితే కోర్టును ఆశ్రయించి అయినా పర్యటనను నిర్వహించడానికి సన్నాహాలు చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement