హైదరాబాద్, ఆంధ్రప్రభ: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీసు శాఖ కొరఢా ఝులిపించింది. నగరంలో నిబంధనలకు విరుద్దంగా మద్యం సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న పలు పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు నిబంధనలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేశారు. శనివారంనాడు మాదాపూర్‌లోని 16 పబ్‌లపై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు రెండు పబ్‌లలో నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నవారిపై కేసులు నమోదు చేశారు. మైనర్లకు మద్యం అందిస్తున్న హాట్‌కప్, బర్డ్ బాక్స్ పబ్‌లపై కేసులు నమోదు చేశారు. ఇందుకు కారకులైన నలుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. లైసెన్సు లేకుండానే పబ్ నిర్వహిస్తున్న బర్డ్ బాక్స్ పబ్‌పై కేసు నమోదు చేశారు.
అదేవిధంగా ఫామ్‌హౌజ్‌ల పేరుతో అక్రమాలకు, అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న తీరుపై కూడా పోలీసులు దృష్టిసారించి కఠిన చర్యలకు దిగారు. అనుమతిలేకుండా ఫామ్‌హౌజ్‌లలోకి మద్యం తీసికెళ్లిన మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ఎటర్నిటీ, ముషీరుద్దీన్ పామ్‌హౌజ్‌లపై కేసులు నమోదు చేశారు. తాజాగా జరుపుతున్న వరుస దాడుల్లో భాగంగా పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోటీసులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే 22 మందిని అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.