వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఓరుగల్లు పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ టూర్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విధి నిర్వహణలో భాగంగా కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులపై పోలీస్ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నాలు చేశారు. అంతే కాకుండా హద్దులు దాటి, పబ్లిక్ లొనే ఓవరయాక్షన్ చేయడం వివాహదాస్పదంగా మారింది. వరంగల్ బస్ స్టేషన్ శంఖుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ప్రోగ్రామ్ కవరేజీ చేయడానికి గాను పెద్ద కెమెరా తో పాటు లైవ్ కిట్ తో ఉన్న వీడియో జర్నలిస్టుతో పాటు మరికొందరు ఫోటోగ్రాఫర్లను వెళ్లకుండా రోప్ పార్టీ అడ్డుకొంది. అంతటితో ఊరుకోకుండా దురుసుగానే కాకుండా అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించారు. ఈ విషయంపై జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తప్పు పట్టారు. పోలీసుల ఓవరయాక్షన్ ఖండించారు.
వీడియో జర్నలిస్టు పై దాడి చేసిన ఎస్సై ని తక్షణమే సస్పెండ్ చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ డిమాండ్ చేసింది. మంత్రి కేటీఆర్ పర్యటనలో కవరేజ్ విధుల్లో ఉన్న ఈటీవీ కెమెరామెన్ వెంకటేష్ పై అకారణంగా దాడికి దిగిన రిజర్వుడ్ ఎస్ఐ భాను ప్రసాద్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు, బొల్లారపు సదయ్య, కోశాధికరి అమర్ డిమాండ్ చేశారు. లైవ్ విధుల్లో ఉన్న వీడియో జర్నలిస్ట్ పై అకారణంగా దాడి చేసి కెమెరా లైవ్ కిట్టు లాక్కొని గొంతు పట్టుకుని నెట్టు వేసిన ఎస్ఐ భాను ప్రసాద్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేతలు సైతం ఖండించారు.