Friday, November 22, 2024

ఎపి ఎన్నిక‌ల బ‌రిలోకి ఖాకీలు…రంగం సిద్ధం చేసుకుంటున్న అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర పోలీసుశాఖలోని కొందరు అధికారులు ఖాకీని వదిలేసి ఖద్దరు తొడగాలనే ఆసక్తిని కనపరుస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ప్రవేశం చేసేందుకు పలువురు పోలీసు అధికారులు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పైగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఇప్పటి నుంచే తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్న ఆయా పోలీసు అధికారులు ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారంటూ ఆ పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాలను ఆశిస్తున్న మరి కొందరు అధికారులైతే అధికార పార్టీలో చేరడమే అనివార్యంగా అనిపిస్తోంది. పోలీసు అధికారులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అందులో వింత కూడా లేదు. పైగా అధికారంలో ఉన్న పార్టీ వైపు చూడటం సహజమే. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సీబిఐ డైరెక్టర్‌ గా పని చేసిన విజయరామారావు ఆ పార్టీలో చేరి మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న వర్ల రామయ్య కూడా పోలీసుశాఖలో సిఐగా పని చేస్తూ ఖాకీ వదిలేసి ఖద్దరు వేసుకున్నవారే. ప్రస్తుత అధికార వైసీపీలో కూడా మాజీ పోలీసు అధికారులు లేకపోలేదు. అయితే నాటి రాజకీయాలు, పార్టీల అజెండాలు, పోలీసులు రాజకీయాల్లోకి వచ్చిన పరిస్ధితులు వేరు. కాని రాష్ట్ర రాజకీయాల్లో నేడు పోలీసుల జోక్యం పెరిగిపోవడం, పోలీసుశాఖ పొలిటికల్‌ కనుసన్నల్లో పని చేయడం, అధికార పార్టీకి అనుకూలంగా పూర్తిగా వ్యవహరిచడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్ధితి నెలకొంది. ఈ నేపధ్యంలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ చెప్పు చేతల్లో పని చేస్తూ ప్రతిపక్ష నేతలు, విపక్షాలపై చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతోపాటు ఏకంగా ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. ఈ తరహా వ్యవహార శైలీతో ఉన్న కొందరు అధికారులు తప్పనిసరి పరిస్ధితిలో రాజకీయ ప్రవేశం చేయాలని, అదికూడా అధికార వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పోలీసు, రాజకీయ వర్గాల్లో బహిరంగ ంగానే చర్చ జరుగుతోంది.

గోరంట్ల మాధవే స్ఫూర్తి..
తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం వంటివి సినిమాల్లో చూస్తుంటాము. బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ వంటి హీరోలు రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యర్ధి పార్టీలపై సినిమాల్లో మాదిరిగా తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు. కాని ఈ ట్రెండ్‌ పోలీసుశాఖకు అంటుకున్నాక విధి నిర్వహణలో ఉన్న పలువురు అధికారులు ప్రతిప క్ష పార్టీకి చెందిన వారిపై వివిధ సందర్భాల్లో యూనిఫారంలో తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం వంటి విన్యాసాలు చేశారు. దీంతో సదరు ఖాకీలు యమ పాపులర్‌ అయ్యారు. ఈ కోవలోనే జేసీ బ్రదర్స్‌పై మీసం మెలేసిన సీఐ గోరంట్ల మాధవ్‌ ఇప్పుడు అధికార వైసీపీ తరుఫున పార్లమెంటు సభ్యులుగా కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న పోలీసుశాఖలోని కొందరు ఖాకీలకు ఇప్పుడు ఈయనే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాజకీయంగా వైసీపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తూ టీ-డీపీ నేతలపై దాడులు చేస్తూ కేసులు పెట్టడమే కాకుండా వారిపై తొడలు కొట్టి మీసాలు మేలెసే పోలీసు అధికారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల కదిరి సీఐ చేసిన ఓవరాక్షన్‌ రాష్ట్ర రాజకీయాల్లో, పోలీసు వర్గాల్లో చర్చకు దారిచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపధ్యంలో ఈ ట్రెండ్‌ వెనుక వైసీపీ టిక్కెట్ల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాల ంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక్క అనంతపురం జిల్లాలోనే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలువురు పోలీసు అధికారుల పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాడిపత్రి డీఎస్పీ చైతన్య ప్రస్తావన కూడా అధికార రాజకీయాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

వైసీపీ టిక్కెట్ల కోసం ఒత్తిడి..
ఈసారి టిక్కెట్ల కోసం పోలీస్‌ ఆఫీసర్ల నుంచి వైసీపీకి విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్న కొందరు ఖాకీలు అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత టీడీపీహయాంలో సీఐగా ఉంటూ ఇదే పని చేసిన గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టిక్కెట్‌ ఇచ్చి జగన్‌ గెలిపించారు. ఈ మాదిరిగానే పోలీసుశాఖలో రాజకీయ ఆశలు ఉన్న వారంతా ప్రస్తుతం ఈ ఫార్ములానే పాటిస్తున్నారు. ఇప్పుడు టీ-డీపీ నేతలను టార్గెట్‌ చేసుకున్న అనేక మంది పోలీసు అధికారులు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి దారుణంగా ఉంటు-ందని అంచనాకు వచ్చేశారు. అందుకే వీఆర్‌ఎస్‌ తీసుకుంటామని రాజకీయ పునరావాసం కల్పించాలని కోరుతున్నట్లు-గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల సమయం నాటికి వైసీపీ పార్టీకి టిక్కెట్ల పంపకం విషయంలో కొంత ఇబ్బంది తప్పదంటూ రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


పీవీ సునీల్‌ అడుగులు ఏటు..?
ఇక పరిచయం అక్కరలేని ఐపీఎస్‌ పీవీ సునీల్‌కు రాజకీయాల వైపు అడుగులు వేసే ఆలోచన ఉన్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీఐడీ చీఫ్‌గా ఉండగా నిండా మునిగిపోయారు. ఆయనపై చర్యలకు కేంద్రం ఆదేశించింది. తాజాగా జగన్‌ సర్కార్‌ కూడా చర్యల కోసం డీజీపీ కి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. అయితే ఏదోలా బయటపడినా.. ప్రభుత్వం మారితే ఆయన పరిస్థితి దారుణంగా ఉంటు-ందని రాజకీయ వర్గాల స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఆయన కూడా వైసీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నట్లు ఆయా వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నికల నాటికి పార్టీలో చేరి అమలాపురం ఎంపీగా లేదా ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement