Saturday, November 23, 2024

మావోల కట్టడికి పకడ్బందీ వ్యూహం.. మణుగూరులో భేటీ అయిన 4 రాష్ట్రాల పోలీసు అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్న పోలీసు యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తూ అణచివేతను అమలు చేయాలని నిర్ణయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరులో శనివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిషా రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులు రహస్యంగా భేటీ అయ్యారు. పక్కన ఉన్న ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆ ప్రభావం తెలంగాణపై అప్పుడప్పుడు కనిపిస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడకపోయినప్పటికీ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు అప్పుడప్పుడు కరపత్రాలను విడుదల చేయడం, గోడపత్రికలను వేయడం, స్థానిక ప్రజా ప్రతినిధులకు హెచ్చరికలను జారీ చేస్తున్నారు.
మరో పక్క ఒడిషాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ ప్రభావం ఏపీలోని కొన్ని జిల్లాలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, నాలుగు రాష్ట్రాలకు చెందిన కొంత మంది పోలీసు అధికారులు భేటీ అయి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. మావోయిస్టులను కట్టడి చేయడంతో పాటు కొత్త రిక్రూట్‌మెంట్‌లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, గ్రామాలలో చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం, విడివిడిగా, కలివిడిగా కూంబింగ్‌లను ముమ్మరం చేయడం తదితర వాటిపై చర్చించినట్లు సమాచారం.

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మారుమూల గ్రామాలకు అభివృద్ధి ఫలాలు అందకుండా అడ్డుకోవడం, అప్పుడప్పుడు వాహనాలను తగులబెట్టడం, రోడ్డు నిర్మాణ పనులు జరుగకుండా కాంట్రాక్టర్లను బెగరించడం లాంటి సంఘటనలు సర్వసాధారణం కావడంపై కూడా సమావేశం చర్చించింది. నాలుగు రాష్ట్రాలలో కూంబింగ్‌ను పెంచేందుకు అవసరమైతే మరిన్ని కేంద్ర బలగాలను పంపేందుకు కూడా హోం మంత్రిత్వ శాఖ సమ్మతించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న కూంబింగ్‌ సిబ్బందికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించేందుకు హోంమంత్రిత్వ శాఖ ఓకే చెప్పిందంటున్నారు. మావోల ప్రభావం తెలంగాణపై పెద్దగా లేకపోయినప్పటికీ ఉనికిని చూటుకునేందుకు అప్పుడప్పుడు చేస్తున్న ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు కేంద్రం సూచించింది. గ్రామీణ ప్రాంతాలలో నిఘా నెట్‌వర్క్‌ను పెంచుకోవాలని, యువతకు ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించింది. లొంగిపోయిన, ఉద్యమ సానుభూతి పరులతో తరచూ సమావేశమవాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యమంలో ఉన్న వారు జనజీవన స్రవంతిలో కలిసేలా వారి వారి బంధువులు, హితులు, సన్నిహితుల ద్వారా వత్తిడి పెంచాలని అధికారులు నిర్ణయించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement