హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో టీవీ నటి మైథిలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భర్తతో 2021లో నెలకొన్న విభేదాల కేసులో ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదన్న మనస్తాపంతో పోలీసులకు కాల్ చేసి మరీ సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. పంజాగుట్ట పీఎస్ ఎస్‌ఐ… ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల సహాయంతో ఆమె ఉన్న ప్రదేశానికి చేరుకుని కాపాడారు. అనంతరం ఆమెను నిమ్స్ దవాఖానాకు తరలించారు పంజాగుట్ట పోలీసులు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో సూర్యాపేట జిల్లా మోతె పీఎస్‌లో మైథిలి తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. తర్వాత సెప్టెంబర్ 2021లో నటి మైథిలి తన భర్తపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆమె భర్త శ్రీధర్, మరో నలుగురు నిందితులుగా ఉన్నారు. కేసు విచారణ పూర్తయిందని, చార్జ్ షీట్ దాఖలు చేయడానికి న్యాయపరమైన అభిప్రాయం కోసం విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. క్రైమ్ నంబర్ 56/2021 ఐపీసీ 498 ఏ, డొమెస్టిక్ వాయోలెన్స్ డీపీ యాక్ట్ 3, 4 సెక్షన్లలో కింద పంజాగుట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
టీవీ నటి మైథిలీ గతంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఉండేవారు. అక్కడ ఉంటున్న సమయంలో బంగారు ఆభరణాలు పోయాయని పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై నిన్న మరోసారి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు మైథిలి వెళ్లారు. పంజాగుట్ట పోలీసులు సరిగా స్పందించలేదని మనస్తాపానికి గురైన ఆమె వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సారథి స్టూడియోస్ వెనకాల ఉన్న తన అపార్ట్‌మెంట్ కు చేరుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు నటి నివాసానికి చేరుకొని ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మైథిలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.