రాష్ట్రంలో 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు మే 26న దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు.. 12.91 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు TSLPRB పేర్కొంది. 3.55 లక్షల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక.. హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఉన్నాయి. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు TSLPRB తెలిపింది. కాగా.. తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి.
ఇక ప్రిలిమ్స్ పరీక్ష తేదీల విషయానికొస్తే.. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తేదీల్లో ఏమైనా మార్పులు ఉంటే ముందే ప్రకటిస్తామని TSLPRB ఛైర్మన్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..