ఆదివారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీ రిషాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లె మండలం మాలెపాడు పంచాయతీ పరిధిలో గల నాగరాజు మామిడి తోటలో తనిఖీ చేయగా… అక్కడ నిషేదిత గసగసాల పంటను సాగు చేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. కాగా అక్కడే ఉన్న లక్ష్మన్న మరియు అతని కుమారుడైన సోమ శేఖర్ ను అదుపులోనికి తీసుకుని విచారించగా తోట యజమాని లక్ష్మన్న బామ్మర్ది అయిన నాగరాజు పంటను సాగు చేస్తున్నట్లు వారు తెలిపారు.
అయితే మొదట పోలీసులు వస్తున్నట్లు తెలిసి సదరు పంటను ట్రాక్టర్ తో దున్నుతుండగా లక్ష్మన్న, సోమశేఖర్ ను అరెస్ట్ చేశారు. వారితో పాటు నాగరాజుని కూడా అరెస్ట్ చేసి విచారించగా తన పొలం లో పది సెంట్ల విస్తీర్ణం లో సుమారు 15 వేల గసగసాల మొక్కలను సాగు చేస్తున్నట్లు, ఎవరికీ అనుమానం రాకుండా పొలం చుట్టూ మూడు అంచెలుగా కంచెను ఏర్పాటు చేసినట్లు నాగరాజు తెలిపాడు.
ఇదిలా ఉండగా మదనపల్లి మండలం ఆ మాలెపాడు వ్యవసాయ పొలాల్లో ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలను వదిలారు. మాదకద్రవ్యాలను తయారు చేయడానికి గ్రామస్తులు పండిస్తున్న గసగసాల పంటలను గుర్తించడానికి మంగళవారం ఉదయం సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో మదనపల్లె రూరల్ పోలీసులు ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.