Friday, November 22, 2024

పంజాబీ దాబా… ఇక్కడ బిర్యానీతో పాటు గంజాయి కూడా లభించును

కరోనా కారణంగా తమ వ్యాపారం దెబ్బతినడంతో డబ్బు సంపాదించడానికి అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నిందితులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… నిందితుడు గురుప్రీత్ సింగ్ వయసు 30 సంవత్సరాలు, ఫాల్ సీలింగ్ పనిచేసేవాడు. ఇతని తండ్రి కల వెందర్ సింగ్, 70 సంవత్సరాలు, పంజాబీ ధాబా నడిపేవాడు. కొడుకు గురుప్రీత్ సింగ్ కు సరైన పని దొరకనప్పుడు, తండ్రికి సహకరిస్తూ దాబా లో ఉండేవాడు, కరోనా కారణంగా ఒక సంవత్సరం నుండి దాబా వ్యాపారం సరిగా జరగలేదు. వారు ఆర్థిక సమస్యలకు గురయ్యారు.

దీంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని అక్టోబర్ 2020లో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి గురుప్రీత్ సింగ్ తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొనుగోలు చేసి దాబా లో ఉంచి అమాయక ప్రజలకు విక్రయించే వారు. ఒక నెల క్రితం గురుప్రీత్ సింగ్ నాందేడ్ నుండి రూ.15,000/- ల చొప్పున 3 కిలోల గంజాయిని కొనుగోలు చేసి విక్రయించాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు నడుపుతున్న దాబా కు వెళ్లి 2.250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement