హైదరాబాద్,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సోషల్‌మీడియాపై పోలీసుశాఖ మరింత నిఘా పెంచింది. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రా, యూట్యూబ్‌లలో అసభ్యకర, అవమానకర, ఇరు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
రాష్ట్రంలో సోషల్‌మీడియా గీత దాటితే కేసులు నమోదు చేసేందుకు సీఐడీ నేతృత్వంలో ప్రత్యేక విభాగం నిరంతరం నిఘా సారిస్తోన్నట్లు పోలీసులు చెబుతున్నార. దేశంలో ఎక్కడో జరిగిన సంఘటనను ఈ ప్రాంతంలో జరిగినట్లు తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టడం, ఒక వీడియోకు మరో వ్యక్తి సంభాషణలను జోడించి గ్రూపుల్లో వైరల్ చేసే వారిని గుర్తించే పనిలో పడ్డాయి.
పోలీసు శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐడీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తులతో పాటు దానిని ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దృష్టి సారించారు. సోషల్ మీడియా పోస్టుల వివరాలను ప్రత్యేక బృందాలు సేకరించి వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు.
ఏదైనా అభ్యంతరకరమైన పోస్టు వచ్చిన వెంటనే దాని వివరాలు, ఆ పోస్టును ఎవరు పెట్టారు? వారు ఏ ప్రాంతానికి చెందిన వారు, ఆ పోస్టు వల్ల ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతింటాయన్న కోణంలో సైతం సీఐడీ పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
సైబర్ బుల్లిషీట్ :
రాష్ట్రంలో సోషల్ మీడియాపై నిఘా పెంచి మోసాలను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వీరిపై ఐటీ చట్టం కింద బుల్లిషీట్లు తెరుస్తామని, అవరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామన్నారు. రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోలను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం, షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు.
ఇక రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందని, అసభ్యకరమైన పోస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో పొలిటికల్ సెన్సిటివ్ లాంగ్వేజ్, పొలిటికల్ అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్న వారిని గుర్తించి సైబర్ బుల్లీ షీట్లు తెరుస్తామన్నారు.
సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాలు, మారుపేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే సాంకేతికత తమ దగ్గర ఉందని, అసభ్యకర, అశ్లీల, అవమానకర పోస్టులు పెట్టేవారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని పోలీసులు తేల్చిచెబుతున్నారు.
ఐటీ చట్టం :
సామాజిక మాధ్యమాలలో హద్దు దాటితే తిప్పలు తప్పవని, హద్దులు దాటి పోస్టులు పెడితే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రత్యర్థులను కించపరిచేలా, వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా వాయిస్ మెసేజ్‌లు, ఫొటోల మార్ఫింగ్, అసభ్యకర పోస్టులు పెట్టిన వారికి మద్దతిస్తూ కామెంట్లు చేసిన వారితో పాటు ఆయా గ్రూప్‌ల అడ్మిన్‌పై ఐటీ చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వివరిస్తున్నారు.
వాట్సప్, ఫేస్‌బుక్‌లోని ప్రతి పోస్టింగ్‌కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూపులోని ప్రతి సభ్యుని పేరు, చిరునామా తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. అడ్మిన్లు సైతం సభ్యులను గ్రూపులో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలి, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలని వివరించారు.
ఈ క్రమంలో ఆయా గ్రూప్‌ల అడ్మిన్లు వివాదాస్పద, అభ్యంతరకర, ఇర వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టింగ్‌లు పెడితే ఐటీ చట్టం ఐపీసీ సెక్షన్ 153 (ఎ) కింద కేసు నమోదవుతుందని, నేరం రుజువైన పక్షంలో నిందితులకు 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని పోలీసులు వివరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, ఇరు వర్గాల మధ్య వర్గపోరుకు దారితీసే అంశాలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ప్రజలను తప్పుదారి పట్టించే వివరాలు షేర్ చేయకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ప్రతీ గ్రూప్ అడ్మిన్‌పై 90శాతం, గ్రూపు సభ్యులపై 10శాతం బాధ్యత ఉంటుందని గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ గస్తీ :
సామాజిక మధ్యమాల్లో వ్యాపార సంస్థల పేరుతో వచ్చే ప్రకటనలపై ‘గస్తీ’ పెట్టడం ద్వారా ఈ మోసాలను ముందుగానే నివారించవచ్చని సీఐడీ పోలీసులు భావిస్తున్నారు. ఆన్లైన్లో ఏదైనా సంస్థ ప్రచారం చేస్తే పోలీసులు దానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈక్రమంలో వ్యాపార సంస్థ నకిలీదని తేలితే నిందితులపై కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు వివరిస్తున్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియా కారణంగా సైబర్ నేరాలు పెరుగుతున్నట్లు పోలీసు నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో 2023లో అన్ని రకాల నేరాలు 8.97 శాతం పెరిగితే కేవలం సోషల్ మీడియా కారణంగా సైబర్ నేరాలు మాత్రం 17.59 శాతం మేరకు పెరిగినట్లు పోలీసుల రికార్టులు పేర్కొంటున్నాయి.
జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం 2023లో తెలంగాణలో 15,297 సైబర్ నేరాలు నమోదయ్యాయని తెలిపారు. ఇక తరచూ సైబర్ నేరాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై సైబర్ బుల్లిషీట్ తెరిచి కఠినంగా శిక్షించనున్నట్లు సీఐడీ అధికారులు వివరిస్తున్నారు.