మందుబాబులపై కరీంనగర్ పోలీసులు కొరడా జులిపించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పలు వాహనాలు సీజ్ చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ఏకకాలంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో చాలామంది చనిపోవడంతోపాటు ఎందరో క్షతగాత్రులవుతున్నారన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేసామన్నారు. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.