మధ్యప్రదేశ్ లో ఓ కుక్కకు అసలైన యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లాల్సి వచ్చింది. ఓ లాబ్రడార్ కుక్క గురించి ఇద్దరు 2020లో పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ కుక్క ఎవరిదో తేల్చలేకపోయారు ఎవరిని అడిగినా తమదే అంటూ గట్టిగా వాదించారు. దీంతో కుక్క యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది.
ఆ ఇద్దరిలో ఒకరు ఆ లాబ్రడార్ జాతి శునకాన్ని పచ్ మడీ ప్రాంతంలో కొనుగోలు చేశానని చెప్పడంతో పోలీసుల ఆలోచన డీఎన్ఏ పరీక్షలపైకి మళ్లింది. పచ్ మడీలో షాదాబ్ చెప్పిన చిరునామాకు వెళ్లి ఆ కుక్క తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి, వివాదానికి కారణమైన కుక్క డీఎన్ఏతో సరిపోల్చి చూడగా… రెండూ ఒకటేనని తేలింది. దాంతో షాదాబ్ చెప్పిందే నిజమని నిర్ధారించుకున్న పోలీసులు లాబ్రడార్ కుక్కను అతడికే అప్పగించారు.ఈ కుక్కల డీఎన్ఏ పరీక్షలు హైదరాబాదులో నిర్వహించారు. అందుకోసం షాదాబ్ కు రూ.50 వేలు ఖర్చయిందట. ఖర్చయితే అయింది గానీ, తన కుక్క తనకు దక్కింది అదే చాలని షాదాబ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.